టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త! ఈ మేటి బ్యాటర్లు ఇద్దరూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు ‘విరాహిత్’ ద్వయం అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రోహిత్ గైర్హాజరీలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పలు సందర్భాల్లో సారథులుగా జట్టును ముందుండి నడిపించారు.
అదే విధంగా.. రోహిత్- కోహ్లి ఏడాదికి పైగా టీ20ల సెలక్షన్‌కు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. పలు మ్యాచ్‌లలో వీరిద్దరు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి లేకుండా పాండ్యా కెప్టెన్సీలోని యువ జట్టుతోనే టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ఆడనుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా గాయాల కారణంగా ఆటకు దూరం కావడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
వరల్డ్‌కప్‌నకు ముందు కేవలం అఫ్గనిస్తాన్‌తో సిరీస్ మాత్రమే మిగిలి ఉండటం.. సదరు సిరీస్‌కు పాండ్యా, సూర్య అందుబాటులోకి రాకుంటే కెప్టెన్ ఎవరన్న ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీ20 రీఎంట్రీ గురించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ క్రమంలో వారిద్దరు అఫ్గన్‌తో సిరీస్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజే ముగిసిపోవడంతో ‘విరాహిత్’ ద్వయానికి కాస్త విశ్రాంతి కూడా లభించడం సానుకూలాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును శుక్రవారమే ఫైనల్ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ఆడటం దాదాపుగా ఖాయమైపోగా.. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు మాత్రం మేనేజ్‌మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.
అయితే, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
మరోవైపు.. ఏడాది కాలంగా టీమిండియా తరఫున టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ ద్వారా రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్లో టచ్‌లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్-2024 కంటే ముందు వాళ్లిద్దరు ఐపీఎల్-2024లో భాగం కానున్నారు.
చదవండి: Ind vs SA: సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు.. భారత తొలి క్రికెటర్‌గా బుమ్రా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment