ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టును 106 పరుగులతో తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జట్టు ఎంపికతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
కోహ్లి తిరిగి వస్తాడా?
ఈ నేపథ్యంలో అందరి దృష్టి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపైనే ఉంది. తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ ఆఖరి మూడు టెస్టులకు జట్టులోకి వస్తాడా? లేదా అన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న.
అయితే బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల సమయం ఉండడంతో విరాట్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనున్నట్లు వినికిడి. విరాట్ ప్రస్తుతం ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
బుమ్రాకు విశ్రాంతి..
ఇక మూడో టెస్టుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌లోడ్ కారణంగా రాజ్‌కోట్ టెస్టుకు బుమ్రాను పక్కన పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా రెండో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment