
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఈ వన్డే టోర్నమెంట్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కాస్త నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, సెమీస్ చేరాలంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. 67 బంతుల్లో 56 పరుగులు చేసి విరాట్ కోహ్లి(100 నాటౌట్) మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించడంలో భాగమయ్యాడు.
ఆకాశమే హద్దుగా
ఆ తర్వాత గ్రూప్ దశలో ఆఖరుగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ రాణించాడు. జట్టు విజయానికి పునాది వేసే క్రమంలో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించిన టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ
ఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య మ్యాచ్ చూసేందుకు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్(Shresta Iyer) కూడా దుబాయ్ స్టేడియానికి వచ్చింది. తన తమ్ముడిని ఉత్సాహపరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో శ్రేష్టకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రేష్ట.. ఓ ‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్
‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అంటూ సాగే పాటకు జోష్‌గా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఒకరేమో టీమిండియా స్టార్.. మరొకరు బాలీవుడ్ స్టార్’’ అంటూ అక్కాతమ్ముళ్ల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇక ఆసీస్‌పై భారత్ విజయానంతరం శ్రేష్ట మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోలతో పాటు.. సెలబ్రిటీలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
కాగా ముంబైలో 1994లో జన్మించిన శ్రేయస్ అయ్యర్ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 14 టెస్టులు, 68 వన్డేలు, 51 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 811, 2752, 1104 పరుగులు సాధించాడు. మరోవైపు.. శ్రేయస్ అక్క శ్రేష్ట అయ్యర్ 1990లో జన్మించింది.
వీరి తండ్రి సంతోష్ అయ్యర్- కేరళకు చెందినవారు కాగా.. తల్లి రోహిణి అయ్యర్ స్వస్థలం మంగళూరు. వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఇక అక్కాతమ్ముళ్లు శ్రేష్ట- శ్రేయస్‌లకు ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెడుతుంటారు.
చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment