సౌతాఫ్రికాతో సిరీస్‌.. భారత్‌-‘ఎ’ జట్టు వైస్‌ కెప్టెన్‌గా గొంగడి త్రిష | India U19 Women Squad for Triangular Series Vs South Africa Announced | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో సిరీస్‌.. భారత్‌-‘ఎ’ జట్టు వైస్‌ కెప్టెన్‌గా గొంగడి త్రిష

Published Thu, Nov 28 2024 10:28 AM | Last Updated on Thu, Nov 28 2024 10:43 AM

India U19 Women Squad for Triangular Series Vs South Africa Announced

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే అండర్‌–19 మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’ జట్లను ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష భారత ‘ఎ’ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది.

అదే విధంగా... హైదరాబాద్‌కే చెందిన గుగులోత్‌ కావ్యశ్రీకి భారత ‘ఎ’ జట్టులో... కేసరి ధృతికి భారత ‘బి’ జట్టులో చోటు లభించింది. ఆంధ్ర బౌలర్‌ షబ్నమ్‌ భారత ‘ఎ’ జట్టులో ఎంపికైంది. 

పుణె వేదికగా
దక్షిణాఫ్రికాతోపాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలోమ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఇక ఈ టోర్నీ డిసెంబర్‌ 3 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది. కాగా 18 ఏళ్ల త్రిష గత ఏడాది జరిగిన అండర్‌–19 ప్రపంచ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.  

భారత ‘ఎ’ జట్టు: 
సనిక చాల్కె (కెప్టెన్‌), గొంగడి త్రిష (వైస్‌ కెప్టెన్‌), గుగులోత్‌ కావ్యశ్రీ, భవిక అహిరె, జోషిత, హర్లీ గాలా, సస్తీ మండల్, సిద్ధి శర్మ, సోనమ్‌ యాదవ్, గాయత్రి సుర్వసె, చాందిని శర్మ, హ్యాపీ కుమారి, షబ్నమ్, బిదిషా డే, ప్రాప్తి రావల్‌. 

భారత ‘బి’ జట్టు: 
నికీ ప్రసాద్‌ (కెప్టెన్‌), కమలిని (వైస్‌ కెప్టెన్‌), మహంతి శ్రీ, ఇషావరి అవసారె, మిథిలా వినోద్, ఆయుశి శుక్లా, కేసరి ధృతి, పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ, పార్శవి చోప్రా, నందన, అనాది తాగ్డె, అనందిత, సుప్రియా అరెల, భారతి ఉపాధ్యాయ్‌.  

లీగ్‌ దశలోనే తెలంగాణ అవుట్‌ 
సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై జరుగుతున్న జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు కథ లీగ్‌ దశలోనే ముగిసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 0–7 గోల్స్‌ తేడాతో ఛత్తీస్‌గఢ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో తెలంగాణ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 0–11 గోల్స్‌ తేడాతో జార్ఖండ్‌ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తెలంగాణతో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ తరఫున దామిని ఖుస్రో, మధు సిదార్, శ్యామ్‌లీ రే 2 గోల్స్‌ చొప్పున చేయగా... అంజలి ఎక్కా 1 గోల్‌ సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌ 15–0తో బెంగాల్‌ జట్టుపై, ఉత్తర ప్రదేశ్‌ 5–0తో ఉత్తరాఖండ్‌పై, గుజరాత్‌ 1–0తో అస్సాంపై గెలుపొందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement