టీమిండియాదే ఆధిపత్యం | India Vs England 4th Test Day 1 Live Updates Telugu | Sakshi
Sakshi News home page

టీమిండియాదే ఆధిపత్యం

Published Thu, Mar 4 2021 9:14 AM | Last Updated on Thu, Mar 4 2021 5:14 PM

India Vs England 4th Test Day 1 Live Updates Telugu - Sakshi

ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 
భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోయి 24 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 8, పుజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. అండర్సన్‌ వేసిన మొదటి ఓవర్‌ మూడో బంతికే గిల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. క్రీజులో రోహిత్‌ శర్మ, చతేశ్వర్‌ పుజారాలు ఉ‍న్నారు. కాగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవరాల్‌గా చూసుకుంటే టీమిండియా తొలిరోజు ఆటలో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

205 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌
నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరగులుకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ లీచ్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ వేసిన 75వ ఓవర్‌ ఐదో బంతికి లీచ్ ఎల్బీగా వెనుదిరిగాడు. బెన్‌ స్టోక్స్‌ 55 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. 46 పరుగులతో డేనియల్‌ లారెన్స్‌ రాణించాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 4, అశ్విన్‌ 3. సిరాజ్‌ 2, సుందర్‌ ఒక వికెట్‌ తీశారు.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
అక్షర్‌ పటేల్‌ మరోసారి విజృంభించి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ 189 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 70వ ఓవర్ వేసిన అక్షర్‌‌ మొదటి బంతికి లారెన్స్‌ స్టంప్‌గా వెనుదిరిగాడు. అనంతరం 4వ బంతికి బెస్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో 170 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం లారెన్స్‌ 35 పరుగులు, బెస్‌ 2 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్‌ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 61వ ఓవర్‌ మూడో బంతిని ఓలీ పోప్‌ ఫ్లిక్‌ చేయగా.. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి షార్ట్‌ లెగ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ చేతిలో పడింది. దీంతో ఇంగ్లండ్‌ 166 పరుగులు వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. . టీమిండియా బౌలర్లలో అక్షర్‌ రెండు, సిరాజ్‌ రెండు, అశ్విన్‌, సుందర్‌లు చెరో వికెట్‌ తీశారు.

టీ బ్రేక్‌.. ఇంగ్లండ్‌ 144/5
► టీ విరామ సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 56వ ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓలి పోప్‌ 21, లారెన్స్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికే బెన్‌ స్టోక్స్ సుందర్‌ బౌలింగ్‌లో‌ అవుటవుడంతో ఇంగ్లండ్‌ 121 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. ‌

ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 46వ ఓవర్‌ మూడో బంతిని ఫోర్‌గా మలిచిన స్టోక్స్‌ టెస్టు కెరీర్‌లో 24వ అర్థ సెంచరీ సాధించాడు. ఓలీ పోప్‌ 12 పరుగులతో స్టోక్స్‌కు సహకరిస్తున్నాడు.

సిరాజ్‌ సూపర్‌ డెలివరీ.. నాలుగో వికెట్‌ డౌన్‌
టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన డెలివరీతో బెయిర్‌ స్టోను బోల్తా కొట్టించాడు. సిరాజ్‌ వేసిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి బెయిర్‌ స్టో ప్యాడ్లను తాకి వికెట్ల మీదుగా వెళ్లింది. టీమిండియా అప్పీల్‌ చేయడంతో ఫీల్డ్‌ అంపైర్‌ అవుటిచ్చాడు. అయితే అంపైర్‌ నిర్ణయంపై బెయిర్‌ స్టో రివ్యూ కోరాడు.. అయితే రిప్లేలో మాత్రం బంతి మిడిల్‌ స్టంప్‌ వికెటన్లు తాకినట్లుగా తేలింది. దీంతో ఇంగ్లండ్‌ 78 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం స్టోక్స్‌ 28, ఓలి పోప్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

లంచ్‌ విరామం.. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్‌
నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ నిలకడగా ఆడుతుంది. లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 25 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో 28 పరుగులు, స్టోక్స్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. 30 పరుగులకే మూడు వికెట్లు ‌ కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్‌, బెయిర్‌ స్టోలు కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మొదటి సెషన్‌ను ముగించారు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ రెండు.. సిరాజ్‌ ఒక వికెట్‌ తీశాడు.

సిరాజ్‌ దెబ్బ.. రూట్‌ అవుట్‌
టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తాను వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ తొలి బంతికే రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ 30 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. బెయిర్‌ స్టో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

వెనువెంటనే రెండు వికెట్లు
ఇంగ్లండ్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ తాను వేసిన రెండో ఓవర్‌లో 9 పరుగులు చేసిన జాక్‌ క్రాలే భారీ షాట్‌కు యత్నించి సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 15 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. అయితే రెండు వికెట్లు అక్షర్‌ తీయడంతో.. పిచ్‌ మరోసారి స్పిన్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస‍్టులో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతికి ఓపెనర్‌ సిబ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. అక్షర్‌ వేసిన బంతి సిబ్లీ బ్యాట్‌ మధ్యలో నుంచి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 1 వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజులో జాక్‌ క్రాలే 4, బెయిర్‌ స్టో 0 పరుగులుతో ఉన్నారు.

అహ్మదాబాద్‌: టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పర్యాటక జట్టు కెప్టెన్‌ జో రూట్‌ ఆతిథ్య జట్టును ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి నుంచి ఆరంభం కానున్న ఆఖరి టెస్టు కీలకంగా మారింది. ముఖ్యంగా మూడో టెస్టు మాదిరే ఇప్పుడు కూడా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌నే ఉపయోగిస్తారని స్పష్టంగా తేలిపోయింది. అయితే ఈసారి డే మ్యాచ్, ఎరుపు బంతి కాబట్టి బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా నిలబడితే పరుగులకు అవకాశం ఉంటుంది. కాబట్టి టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఈ మేరకు లాభపడే అవకాశం ఉంది.


ఇక ఈ మ్యాచ్‌ గెలిచినా, కనీసం ‘డ్రా’ చేసు‌కున్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే స్థితిలో భారత్‌ ఉంది. మరోవైపు.. ఇప్పటికే ఆ అవకాశాలు కోల్పోయిన ఇంగ్లండ్‌ మాత్రం మొదటి మ్యాచ్‌ తరహాలో అసాధారణ ప్రదర్శనతో సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. కాగా ఇదే మైదానంలో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. అయితే ఈమ్యాచ్‌ అయితే రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో మొటేరా పిచ్‌ రూపొందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

భారత్‌ తుది జట్టు:
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌
ఇంగ్లండ్‌ తుది జట్టు:
సిబ్లీ, జాక్‌ క్రాలే, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, ఒలి పోప్‌, బెన్‌ ఫోక్స్‌, డానియల్‌ లారెన్స్‌, డొమినిక్‌ బెస్‌, జాక్‌ లీచ్‌, జేమ్స్‌ అండర్సన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement