కృనాల్‌- టామ్‌ కరన్‌ గొడవ; కోహ్లి రియాక్షన్‌ చూశారా?! | India Vs England Krunal Tom Curran Argument Kohli Reaction Dugout | Sakshi
Sakshi News home page

కృనాల్‌- టామ్‌ కరన్‌ గొడవ; కోహ్లి రియాక్షన్‌ చూశారా?!

Published Wed, Mar 24 2021 5:05 PM | Last Updated on Wed, Mar 24 2021 5:17 PM

India Vs England Krunal Tom Curran Argument Kohli Reaction Dugout - Sakshi

పుణె: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా... కెరీర్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే వేగవంతమైన హాఫ్‌ సెంచరీ (26 బంతుల్లో) చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్‌గా నిలవగా, అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (4/54) నమోదు చేసిన భారత బౌలర్‌గా ప్రసిధ్‌ కృష్ణ రికార్డు సాధించాడు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశంలో 10 వేల పరుగులు చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(98) ఐదో స్థానంలో నిలిచాడు.

ఈ క్రమంలో తొలి వన్డేలో 66 పరుగులతో పర్యాటక జట్టును మట్టికరిపించిన భారత్‌ గెలుపుతో సిరీస్‌ను ఆరంభించింది. అయితే, మొదటి వన్డేలో పలు చిరస్మరణీయ రికార్డులతో పాటు, కృనాల్‌ పాండ్యా- టామ్‌ కరన్‌ మధ్య జరిగిన వాగ్వాదం కూడా క్రీడా ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా, 49వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌ బౌలింగ్‌ల్‌ సింగిల్‌ తీసే క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అంపైర్‌ నితిన్‌ మీనన్‌ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, కృనాల్‌ దూకుడుగా వ్యవహరిస్తూ టామ్‌పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు.

ఇంతలో జోస్‌ బట్లర్‌ వచ్చి, టామ్‌తో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరిస్థానాల్లోకి వారు వెళ్లారు. ఈ క్రమంలో కృనాల్‌ను తన స్థానానికి వెళ్లాల్సిందిగా అంపైర్‌ మరోసారి సూచించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక డగౌట్‌లో కూర్చుని, ఇదంతా చూస్తున్న కెప్టెన్‌ కోహ్లి కాసేపు కన్ఫ్యూజన్‌కు లోనయ్యాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అలాగే తీక్షణంగా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement