World Cup 2023: టీమిండియా అభిమానులకు నిరాశ | India Vs Netherlands ICC ODI WC Warm Up Match Abandoned Without Toss, Check Other Matches Details - Sakshi
Sakshi News home page

IND Vs NED Match Abandoned: టీమిండియా అభిమానులకు నిరాశ

Published Tue, Oct 3 2023 4:55 PM | Last Updated on Tue, Oct 3 2023 5:43 PM

India Vs Netherlands Match Abandoned Without Toss - Sakshi

టీమిండియా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు ఆడాల్సిన రెండు వార్మప్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సెప్టెంబర్‌ 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌ టాస్‌ అనంతరం రద్దు కాగా.. ఇవాళ (అక్టోబర్‌ 3) తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది.

మొత్తంగా తిరువనంతపురంలో జరగాల్సిన నాలుగు గేమ్స్‌లో మూడు వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసాయి. ఈ వేదికపై నిన్న జరిగిన న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక్కటే ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. 

మరోవైపు ఇవాళ జరగాల్సిన మిగతా రెండు వార్మప్‌ మ్యాచ్‌లు సజావుగా సాగుతున్నాయి. గౌహతి వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఇరగీస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్‌ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగా.. పాక్‌తో మ్యాచ్‌లో ఆసీస్‌ 37 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టాని​కి 221 పరుగులు చేసింది. 

59 బంతుల్లోనే శతక్కొట్టిన కుశాల్‌..
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో  15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్‌ మెండిస్‌ తగ్గకుండా ఆడాడు. 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పథుమ్‌ నిస్సంక (30), దిముత్‌ కరుణరత్నే (8) ఔట్‌ కాగా.. సమరవిక్రమ (32), అసలంక క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో  ముజీబ్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

బ్యాట్‌ ఝులిపిస్తున్న మ్యాక్సీ..
పాక్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌ ఝులిపిస్తున్నాడు. మ్యాక్సీ 55 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ (48), లబూషేన్‌ (40), మిచెల్‌ మార్ష్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్‌ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు గ్రీన్‌ (7) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్‌ బౌలర్లలో ఉసామా మిర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్‌ రౌఫ్‌, మొహమ్మద్‌ నవాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement