ఎజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన సంబరాలు న్యూజిలాండ్ శిబిరంలో కొన్ని గంటలు కూడా సాగలేదు. ఈ చారిత్రక ఘట్టాన్ని ఆస్వాదించేలోపే జట్టు ఆనందం చెల్లాచెదురైంది. పదునైన భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక న్యూజిలాండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. భారత గడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అవాంఛనీయ రికార్డును నెలకొల్పుతూ రెండో టెస్టులో రెండో రోజే కివీస్ చేతులెత్తేసింది. 263 పరుగుల ఆధిక్యం దక్కిన తర్వాత కూడా ఫాలోఆన్ ఆడించకుండా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆట ముగిసేసరికి తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకొని విజయంపై గురి పెట్టింది.
ముంబై: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ గెలుపు ఇక లాంఛనమే కావచ్చు. శనివారం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. జేమీసన్ (17)దే అత్యధిక స్కోరు. దాంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేయడంతో ఓవరాల్ ఆధిక్యం 332 పరుగులకు చేరింది. ఫీల్డింగ్‌లో గాయపడిన శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయకపోగా... మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఉదయం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (311 బంతుల్లో 150; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరికొన్ని పరుగులు జోడించగా, అక్షర్ పటేల్ (128 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టాడు.
మరో 39.5 ఓవర్లు...
ఓవర్‌నైట్ స్కోరు 221/4తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌కు రెండో ఓవర్లోనే దెబ్బ పడింది. ఎజాజ్ వరుస బంతుల్లో సాహా (27), అశ్విన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో మయాంక్‌కు అక్షర్ అండగా నిలిచాడు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే 150 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాతి బంతికే మయాంక్ వెనుదిరిగాడు. అనంతరం 113 బంతుల్లో అక్షర్ టెస్టుల్లో తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అక్షర్‌ను కూడా వెనక్కి పంపిన అనంతరం ఎజాజ్... తన తర్వాతి ఓవర్లో జయంత్ (12), సిరాజ్ (4)ల పని పట్టి చరిత్ర సృష్టించాడు. శనివారం ఆడిన 39.5 ఓవర్లలో మరో 104 పరుగులు జోడించిన టీమిండియా చివరి 6 వికెట్లు కోల్పోయింది.
చెలరేగిన సిరాజ్...
భారత్‌ను మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్న ఆనందం న్యూజిలాండ్‌కు ఎంతోసేపు నిలవలేదు. మన బౌలర్ల పదునైన బంతులను ఒక్క బ్యాటర్ కూడా సరిగా ఎదుర్కోలేకపోవడంతో కివీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో మొదటి మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. తన రెండో ఓవర్లోనే యంగ్ (4), కెప్టెన్ లాథమ్ (10)లను సిరాజ్ వెనక్కి పంపించాడు. ఆపై మరో అద్భుత బంతితో రాస్ టేలర్ (1)ను అతను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. టీ సమయానికే కివీస్ స్కోరు 38/6కు చేరింది. విరామం తర్వాత జట్టు ఆట ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ సెషన్‌లో అశ్విన్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి ప్రత్యర్థిని పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 10; యంగ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 4; మిచెల్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; రాస్ టేలర్ (బి) సిరాజ్ 1; నికోల్స్ (బి) అశ్విన్ 7; బ్లన్‌డెల్ (సి) పుజారా (బి) అశ్విన్ 8; రచిన్ రవీంద్ర (సి) కోహ్లి (బి) జయంత్ 4; జేమీసన్ (సి) అయ్యర్ (బి) అక్షర్ 17; సౌతీ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 0; సోమర్‌విలే (సి) సిరాజ్ (బి) అశ్విన్ 0; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (28.1 ఓవర్లలో ఆలౌట్) 62.
వికెట్ల పతనం: 1–10, 2–15, 3–17, 4–27, 5–31, 6–38, 7–53, 8–53, 9–62, 10–62. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 5–2–7–0, సిరాజ్ 4–0–19–3, అక్షర్ పటేల్ 9.1–3–14–2, అశ్విన్ 8–2–8–4, జయంత్ యాదవ్ 2–0–13–1.
భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 38; పుజారా (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (21 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 69. బౌలింగ్: సౌతీ 5–0–14–0, ఎజాజ్ 9–1–35–0, జేమీసన్ 4–2–5–0, సోమర్‌విలే 2–0–9–0, రచిన్ 1–0–4–0.
Comments
Please login to add a commentAdd a comment