
సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్
తొలి టి20లో భారత్ ఘన విజయం
61 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు
రేపు రెండో టి20 మ్యాచ్
దాదాపు నెల రోజుల క్రితం హైదరాబాద్ టి20 మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో అలరించిన సంజు సామ్సన్ అదే ఫామ్‌ను కేప్‌టౌన్ వరకు తీసుకెళ్లాడు. వేదిక మారినా, ప్రత్యర్థి మారినా అదే దూకుడుతో సిక్సర్ల వర్షం కురిపించిన అతను వరుసగా రెండో శతకంతో మెరిసి ఈ ఘనత సాధించిన అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
సామ్సన్ మెరుపు బ్యాటింగ్ కారణంగా భారీ స్కోరుతో ప్రత్యర్థికి భారత్ సవాల్ విసిరింది. ఆపై చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చి సిరీస్‌లో శుభారంభం చేసింది. సొంతగడ్డపై కూడా అన్ని రంగాల్లో సమష్టిగా విఫలమైన సఫారీ టీమ్ ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాన్ని మూటగట్టుకుంది.
కేప్‌టౌన్: టి20 క్రికెట్ ప్రపంచ చాంపియన్ భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో మరోసారి దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించింది. శుక్రవారం కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్‌వర్మ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించాడు.
అనంతరం దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. క్లాసెన్ (25)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు. సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేయగా, రెండో టి20 మ్యాచ్ జిఖెబెర్హాలో ఆదివారం జరుగుతుంది.
మెరుపు భాగస్వామ్యాలు... జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా... ఆ తర్వాతి రెండు ఓవర్లలో భారత్ 22 పరుగులు రాబట్టింది. అభిషేక్ శర్మ (7) విఫలం కాగా, సామ్సన్ తన దూకుడుతో వేగంగా పరుగులు రాబట్టాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జత కలవడంతో స్కోరు దూసుకుపోయింది.
పవర్‌ప్లేలో జట్టు 56 పరుగులు సాధించింది. జాన్సెన్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్... పీటర్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్‌కు 37 బంతుల్లో 66 పరుగులు జోడించారు. ఆ తర్వాత సామ్సన్, తిలక్ కలిసి ధాటిని కొనసాగిస్తూ సఫారీ బౌలర్లపై చెలరేగారు.
క్రూగర్ ఓవర్లో తిలక్ వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు మహరాజ్ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా సింగిల్ తీయడంతో సామ్సన్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మూడో వికెట్‌కు 77 పరుగులు (34 బంతుల్లో) జత చేసిన అనంతరం తిలక్ వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా భారత బ్యాటింగ్ నెమ్మదించింది. 16 పరుగుల వ్యవధిలో సామ్సన్, హార్దిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11) అవుట్ కావడం జట్టు స్కోరు వేగానికి బ్రేక్ వేసింది. చివరి 5 ఓవర్లలో భారత్ 35 పరుగులే చేసింది.
టపటపా... భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ కనీసస్థాయి ఆటను ప్రదర్శించలేదు. టీమ్‌లో ఒక్క బ్యాటర్ కూడా పట్టుదలగా నిలబడలేకపోయాడు. భారత బౌలర్ల జోరుతో పవర్‌ప్లే ముగిసేలోపే సఫారీ స్కోరు 44/3 వద్ద నిలిచింది. ఈ స్థితిలో క్లాసెన్, మిల్లర్ (18) జోడీ ఆదుకుంటుందని జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో సఫారీ గెలుపు దారులు దాదాపుగా మూసుకుపోయాయి. ఆ తర్వాత ఇతర బ్యాటర్లు కొద్దిసేపు పోరాడటం మినహా విజయానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) స్టబ్స్ (బి) పీటర్ 107; అభిషేక్ (సి) మార్క్‌రమ్ (బి) కొయెట్జీ 7; సూర్యకుమార్ (సి) సిమ్‌లేన్ (బి) క్రూగర్ 21; తిలక్ వర్మ (సి) జాన్సెన్ (బి) మహరాజ్ 33; పాండ్యా (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 2; రింకూ సింగ్ (సి) క్లాసెన్ (బి) కొయెట్జీ 11; అక్షర్ పటేల్ (సి) స్టబ్స్ (బి) జాన్సెన్ 7; అర్ష్‌దీప్ (నాటౌట్) 5; బిష్ణోయ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1-24, 2-90, 3-167, 4-175, 5-181, 6-194, 7-199, 8-202. బౌలింగ్: జాన్సెన్ 4-0-24-1, మార్క్‌రమ్ 1-0-10-0, కేశవ్ మహరాజ్ 4-0-34-1, కొయెట్జీ 4-0-37-3, పీటర్ 3-0-35-1, క్రూగర్ 2-0-35-1, సిమ్‌లేన్ 2-0-27-0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) తిలక్ (బి) వరుణ్ 21; మార్క్‌రమ్ (సి) సామ్సన్ (బి) అర్ష్‌దీప్ 8; స్టబ్స్ (సి) సూర్యకుమార్ (బి) అవేశ్ 11; క్లాసెన్ (సి) అక్షర్ (బి) వరుణ్ 25; మిల్లర్ (సి) అవేశ్ (బి) వరుణ్ 18; క్రూగర్ (సి) పాండ్యా (బి) బిష్ణోయ్ 1; జాన్సెన్ (సి) పాండ్యా (బి) బిష్ణోయ్ 12; సిమ్‌లేన్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 6; కొయెట్జీ (రనౌట్) 23; మహరాజ్ (బి) అవేశ్ 5; పీటర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1-8, 2-30, 3-44, 4-86, 5-87, 6-87, 7-93, 8-114, 9-135, 10-141. బౌలింగ్: అర్ష్‌దీప్ 3-0-25-1, అవేశ్ ఖాన్ 2.5-0-28-2, పాండ్యా 3-0-27-0, వరుణ్ చక్రవర్తి 4-0-25-3, రవి బిష్ణోయ్ 4-0-28-3, అక్షర్ 1-0-8-0.
4 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌లలో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా సామ్సన్ నిలిచాడు. గతంలో గుస్తావ్ మెక్‌కియాన్ (ఫ్రాన్స్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), రిలీ రోలో (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment