ఎంతటి భారీ స్కోరైనా భారత్ ముందు తక్కువేనని మరోసారి రుజువైంది. ఓపెనర్లు విఫలమైనా శ్రేయస్ అయ్యర్, సంజు సామ్సన్, రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌కు జట్టుకు మరో విజయాన్ని, సిరీస్‌ను అందించింది. 60 బంతుల్లో 104 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం కష్టంగా అనిపించినా... మన బ్యాటర్లు అలవోకగా పరుగులు బాదేశారు. ముందుగా భారీ స్కోరు చేయడంతో పాటు ఆరంభంలో భారత్‌ను నిలువరించగలిగిన లంక ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. సిరీస్ ఫలితం తేలిపోగా, మిగిలిన మూడో మ్యాచ్ లాంఛనం నేడు పూర్తి కానుంది.
ధర్మశాల: శ్రీలంకతో జరిగిన రెండో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.
4 ఓవర్లలో 72 పరుగులు...
ఓపెనర్లు నిసాంకా, గుణతిలక జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ప్రారంభించడంతో పవర్‌ప్లేలో శ్రీలంక 32 పరుగులే చేయగలిగింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 6 బాది దూకుడు ప్రదర్శించిన గుణతిలక నాలుగో బంతికి అవుట్ కావడంతో 67 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం (52 బంతుల్లో) ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో అసలంక (2), మిషారా (1) వెనుదిరగ్గా, చండిమాల్ (9) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నిసాంకా, షనక భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు 26 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో భారత బౌలర్లపై లంక విరుచుకుపడింది. హర్షల్ వేసిన 17 ఓవర్లో షనక 2 సిక్స్‌లు బాదగా నిసాంకా ఫోర్ కొట్టాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో నిసాంకా మూడు ఫోర్లతో చెలరేగగా, భువీ ఓవర్లో షనక వరుసగా 6, 4తో చెలరేగాడు. నిసాంకా వెనుదిరిగిన తర్వాత హర్షల్ వేసిన 20వ ఓవర్లోనూ షనక సత్తా చాటాడు. ఈ నాలుగు ఓవర్లలో లంక వరుసగా 19, 14, 16, 23 పరుగులు సాధించడం విశేషం.
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్ (1) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా, ఇషాన్ (15) కూడా పవర్‌ప్లేలోనే అవుటయ్యాడు. అయితే శ్రేయస్, సామ్సన్ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ముందుగా బినూరా ఓవర్లో మూడు ఫోర్లతో జోరు మొదలు పెట్టిన శ్రేయస్ దానిని కొనసాగించాడు. జయవిక్రమ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను కరుణరత్నే బౌలింగ్‌లో మరో సిక్సర్‌తో 30 బంతుల్లోనే సిరీస్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో తడబడిన సామ్సన్... కుమార ఓవర్లో చెలరేగిపోయాడు. ఒక ఫోర్, 3 భారీ సిక్సర్లు బాదిన అనంతరం అదే ఓవర్లో బినూరా అద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు. 42 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన ఈ దశలో జడేజా దాదాపు ఒంటి చేత్తో మ్యాచ్‌ను ముగించాడు. చమీరా ఓవర్లో వరుసగా కొట్టిన 6, 4, 4, 4 అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. జడేజా, శ్రేయస్ నాలుగో వికెట్‌కు 26 బంతుల్లోనే అభేద్యంగా 58 పరుగులు జత చేశారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంకా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 75; గుణతిలక (సి) వెంకటేశ్ (బి) జడేజా 38; అసలంక (ఎల్బీ) (బి) చహల్ 2; మిషారా (సి) శ్రేయస్ (బి) హర్షల్ 1; చండీమాల్ (సి) రోహిత్ (బి) బుమ్రా 9; షనక (నాటౌట్) 47; కరుణరత్నే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–67, 2–71, 3–76, 4–102, 5–160. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, బుమ్రా 4–0–24–1, హర్షల్ పటేల్ 4–0–52–1, చహల్ 4–0–27–1, రవీంద్ర జడేజా 4–0–37–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) చమీరా 1; ఇషాన్ కిషన్ (సి) షనక (బి) కుమార 16; శ్రేయస్ (నాటౌట్) 74; సామ్సన్ (సి) బినూరా (బి) కుమార 39; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–9, 2–44, 3–128. బౌలింగ్: చమీరా 3.1–0–39–1, బినూరా 4–0–47–0, కుమార 3–0–31–2, జయవిక్రమ 2–0–19–0, కరుణరత్నే 3–0–24–0, షనక 2–0–24–0.
Comments
Please login to add a commentAdd a comment