అహ్మదాబాద్: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ చేసింది 237 పరుగులే. కాస్త జాగ్రత్తగా ఆడినా వెస్టిండీస్ ఈ లక్ష్యాన్ని ఛేదించవచ్చు. కానీ భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి బౌలింగ్‌తో విండీస్‌ను కట్టి పడేశారు. తక్కువ స్కోరును కూడా కాపాడుకుంటూ సిరీస్‌ను గెలిపించారు. విండీస్ గత మ్యాచ్‌లాగే మరోసారి పేలవ బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 44 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో గెలుచుకోగా, రేపు చివరి వన్డే జరుగుతుంది.
కోహ్లి మళ్లీ విఫలం...
వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన రాహుల్‌కు జట్టులో చోటు దక్కడంతో ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టిన భారత్, ప్రయోగాత్మకంగా రిషభ్ పంత్‌తో కెరీర్‌లో తొలిసారి ఓపెనింగ్ చేయించింది. అయితే కీమర్ రోచ్ తన రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (5)ను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ తీయగా... పంత్ (18) ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేక తడబడుతూ ఆడాడు. గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్న పొలార్డ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఒడెన్ స్మిత్ ఒకే ఓవర్లో పంత్‌తో పాటు కోహ్లి (18)ని కూడా అవుట్ చేశాడు.
ఈ దశలో రాహుల్, సూర్యకుమార్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 4 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ హోప్ వదిలేయడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో పరుగులు సాధించారు. నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం రనౌట్‌తో ఈ భాగస్వామ్యం విడిపోయింది. ఆ తర్వాత 70 బంతుల్లో సూర్యకుమార్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య వెనుదిరిగిన తర్వాత చివర్లో దీపక్ హుడా (29), సుందర్ (24) కొన్ని కీలక పరుగులు జత చేశారు. చివరి పది ఓవర్లలో భారత్ 54 పరుగులే చేయగలిగింది.
టపటపా...
ఛేదనను విండీస్ సానుకూలంగానే ప్రారంభించినా... ప్రసిధ్ ఆ జట్టు పతనానికి శ్రీకారం చుట్టాడు. తన వరుస ఓవర్లలో అతను బ్రండన్ కింగ్ (18), డారెన్ బ్రేవో (1)లను అవుట్ చేశాడు. ఆ తర్వాత షై హోప్ (27)ను చహల్ పెవిలియన్ పంపించగా... పది పరుగుల వ్యవధిలో పూరన్ (9), హోల్డర్ (2) వెనుదిరగడంతో విండీస్ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి వరకు చక్కగా బ్యాటింగ్ చేసిన బ్రూక్స్‌ను దీపక్ హుడా తన తొలి అంతర్జాతీయ వికెట్‌గా అవుట్ చేయడంతో విండీస్ వేగంగా ఓటమి వైపు దూసుకుపోయింది. చివర్లో హొసీన్ (52 బంతుల్లో 34; 3 ఫోర్లు), స్మిత్ (24) కొంత పోరాడినా అది విజయానికి సరిపోలేదు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హోప్ (బి) రోచ్ 5; పంత్ (సి) హోల్డర్ (బి) స్మిత్ 18; కోహ్లి (సి) హోప్ (బి) స్మిత్ 18; రాహుల్ (రనౌట్) 49; సూర్య కుమార్ (సి) జోసెఫ్ (బి) అలెన్ 64; సుందర్ (సి) జోసెఫ్ (బి) హొసీన్ 24; హుడా (సి) హొసీన్ (బి) హోల్డర్ 29; శార్దుల్ (సి) బ్రూక్స్ (బి) జోసెఫ్ 8; సిరాజ్ (సి) హోప్ (బి) జోసెఫ్ 3; చహల్ (నాటౌ ట్) 11; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 237.
వికెట్ల పతనం: 1–9, 2–39, 3–43, 4–134, 5–177, 6–192, 7–212, 8–224, 9–226.
బౌలింగ్: రోచ్ 8–0–42–1, జోసెఫ్ 10–0–36–2, ఒడెన్ స్మిత్ 7–0–29–2, హోల్డర్ 9–2–37–1, హొసీన్ 6–0–39–1, అలెన్ 10–0–50–1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (సి) సూర్యకుమార్ (బి) చహల్ 27; కింగ్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 18; బ్రేవో (సి) పంత్ (బి) ప్రసిధ్ 1; బ్రూక్స్ (సి) సూర్యకుమార్ (బి) హుడా 44; పూరన్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 9; హోల్డర్ (సి) హుడా (బి) శార్దుల్ 2; హొసీన్ (సి) పంత్ (బి) శార్దుల్ 34; అలెన్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; ఒడెన్ స్మిత్ (సి) కోహ్లి (బి) సుందర్ 24; జోసెఫ్ (నాటౌట్) 7; రోచ్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 193.
వికెట్ల పతనం: 1–32, 2– 38, 3–52, 4–66, 5–76, 6–117, 7–159, 8– 159, 9–193, 10–193.
బౌలింగ్: సిరాజ్ 9–1– 38–1, శార్దుల్ 9–1–41–2, ప్రసిధ్ కృష్ణ 9–3– 12–4, చహల్ 10–0–45–1, సుందర్ 5–0–28–1, హుడా 4–0–24–1.
Comments
Please login to add a commentAdd a comment