![India will play Bangladesh today - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/15/india.jpg.webp?itok=NU5DsMU7)
కొలంబో: ఆసియా కప్‌లో ఫలితం దృష్ట్యా ప్రాధాన్యత లేని చివరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ‘సూపర్–4’ దశలో భాగంగా నేడు జరిగే పోరులో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే టోర్నీలో ఫైనల్‌కు చేరగా... బంగ్లాదేశ్ ఫైనల్ రేసు నుంచి ముందే నిష్క్రమించింది. ఇరు జట్లకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆటగాళ్లను పరీక్షించడం లేదా విశ్రాంతి మాత్రమే ఈ మ్యాచ్‌కు సంబంధించి ప్రధానంగా మారాయి.
ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా మూడు అంతకుమించి దేశాలు పాల్గొన్న టోర్నీల్లో బంగ్లాదేశ్ చేతిలో ఏనాడూ ఓడని టీమిండియా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం కనిపిస్తుండగా మ్యాచ్ రోజు వర్షసూచన లేకపోవడం విశేషం.
అయ్యర్ బరిలోకి...
మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకపోయినా భారత్ అనవసరపు మార్పులు చేయకపోవచ్చు. రాబోయే వరల్డ్‌కప్ సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే పూర్తి స్థాయి రెగ్యులర్ జట్టుతోనే బరిలోకి దిగవచ్చు. టాప్–3 రోహిత్, గిల్, కోహ్లి ఇప్పటికే సిరీస్‌లో తమ సత్తా ప్రదర్శించగా, ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ తన విలువేంటో పాక్‌తో మ్యాచ్‌లో చూపించడం మేనేజ్‌మెంట్‌కు బెంగ తగ్గింది.
అయితే మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మాత్రమే కాస్త ఇబ్బందికరంగా ఉంది. గాయంతో అతను రెండు మ్యాచ్‌లు ఆడలేదు. అతడి బ్యాటింగ్‌ను పరీక్షించడం ఇప్పుడు కీలకం. గురువారం నెట్స్‌లో అందరికంటే ఎక్కువగా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసిన అతను మ్యాచ్‌కు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. అయ్యర్‌ను ఆడించాలనుకుంటే కిషన్‌ను పక్కన పెట్టవచ్చు.
టోర్నీలో బుమ్రా మరీ ఎక్కువగా ఏమీ బౌలింగ్ చేయలేదు కాబట్టి విశ్రాంతి అనవసరం. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం సిరాజ్ స్థానంలో షమీని ఎంచుకునే అవకాశం ఉంది. ఆపై పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని శార్దుల్, అక్షర్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. టోర్నీలో మొత్తంలో అఫ్గానిస్తాన్‌పై ఒక మ్యాచ్ గెలవడం మినహా బంగ్లాదేశ్ ఏ రకంగానూ ఆకట్టుకోలేకపోయింది. గత కొన్నాళ్లుగా వన్డేల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే టోర్నీలో మంచి పోటీ ఇవ్వగలదని భావించినా అంతా తలకిందులైంది.
కెప్టెన్ షకీబ్ సహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. తొలి రెండు మ్యాచ్‌లలో చెలరేగిన నజు్మల్ గాయంతో స్వదేశం తిరిగి వెళ్లగా, వికెట్ కీపర్ ముషి్ఫకర్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లను ఆ జట్టు పరీక్షించే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎలా ఆడినా షకీబ్ ప్రదర్శనపైనే ఆ జట్టు విజయావకాశాలు ప్రధానంగా ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment