ఒకే ఒక్క విజయం.. 140 కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఒకే ఒక్క విజయం.. భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఒకే ఒక్క విజయం.. సరిగ్గా ఏడు నెలల కిందట తగిలిన గాయాన్ని మాయం చేసింది.
ఒకే ఒక్క విజయం.. ఎంతో మంది కళ్లల్లో అనంద భాష్పాలను చిమ్మేలా చేసింది. గత 13 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతం అయింది. విశ్వవేదికపై భారత జెండాను రోహిత్ సేన రెపరెపలాడించింది.
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా టీమిండియా అవతరించింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. రెండో సారి టీ20 వరల్డ్ ట్రోఫీని ముద్దాడింది. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌ను ఎంఎస్ ధోని అందించగా.. ఇప్పుడు రోహిత్ శర్మ 17 ఏళ్ల తర్వాత భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.
ఆఖరి వరకు ఉత్కంఠ..
ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ తుది పోరులో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్వింటన్ డికాక్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31) జట్టును ఆదుకున్నారు.
దీంతో దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగింది. అప్పుడే అక్షర్ పటేల్.. స్టబ్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. అయితే స్టబ్స్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్.. డికాక్‌తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
సిక్సర్ల వర్షం కురిపించాడు. అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది క్లాసెన్ 24 పరుగులు రాబట్టాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసన్.. పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో సౌతాఫ్రికా విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారిపోయింది. దక్షిణాఫ్రికా విజయం ఖాయమని అంతా భావించారు.
హార్దిక్ మాయ.. బుమ్రా, అర్ష్‌దీప్ అదుర్స్
ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. 16 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినప్పటికి క్రీజులో క్లాసెన్, మిల్లర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో భారత డగౌట్ మొత్తం నిరాశతో నిండిపోయింది. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్న క్లాసెన్‌ను పాండ్యా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు.
అయినా మిల్లర్ ఇంకా క్రీజులో ఉండడంతో భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ ఓవర్‌లో పాండ్యా వికెట్‌తో పాటు కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత 18 ఓవర్ వేసేందుకు వచ్చిన బుమ్రా తన అనుభవాన్ని మొత్తం చూపించాడు.
వరల్డ్‌క్రికెట్‌లో తనకు సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపించుకున్నాడు. బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మార్కో జాన్సెన్‌ను ఔట్ చేశాడు. దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 2 ఓవర్లలో 20 పరుగులుగా మారింది.
అయితే 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన అర్ష్‌దీప్ సైతం అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి.
సూపర్‌మేన్ సూర్య..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో మిల్లర్ ఉండడంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తొలి బంతిని హార్దిక్ ఫుల్ టాస్‌గా మిల్లర్ సంధించాడు.
మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దీంతో అది భారీ సిక్సర్ అందరూ భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్యకుమార్ అద్బుతం చేశాడు. బౌండరీ లైన్ అవతల పడే బంతిని సూపర్‌మేన్‌లా క్యాచ్ అందుకున్నాడు.
దీంతో మిల్లర్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. మిల్లర్ వికెట్‌తో భారత్ విజయం ఖాయమైంది. ఆ తర్వాత హార్దిక్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.
59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్‌తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు.
No one in India 🇮🇳 will pass away without liking this post ♥️
Congratulations Team India 🔥#T20WorldCup #INDvSA #ViratKohli #SuryakumarYadav pic.twitter.com/JbIDlWcCKZ— Satyam Patel | 𝕏... (@SatyamInsights) June 29, 2024
Comments
Please login to add a commentAdd a comment