భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్... గత రెండు మ్యాచ్‌లలో లంక జట్టు ప్రదర్శన కారణంగా స్థానిక అభిమానులతో స్టేడియం దాదాపుగా నిండిపోయింది... పాక్‌పై గెలుపు, భారత్‌తో పోరాడిన తీరు తుది పోరుపై కూడా అంచనాలు పెంచాయి... మ్యాచ్ హోరాహోరీగా సాగవచ్చని అనిపించింది...
వర్షంతో ఆట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది... స్టేడియంలో కాస్త ఆలస్యంగా వచ్చినవారు సీట్లలో కుదురుకునే ప్రయత్నంలో ఉండగా... ఆదివారం వినోదం కోసం మరికొందరు ఇళ్లలో సిద్ధపడుతున్నారు... కానీ మరో గంట ముగిసేసరికి ఖేల్ ఖతం... లంక ఇన్నింగ్స్ ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి... ఆపై భారత్ మరో 6.1 ఓవర్లలో ఫటాఫట్ ఛేదన... ఆసియా కప్ ఎనిమిదోసారి భారత్ సొంతం!
ముందుగా మ్యాచ్ మూడో బంతికి వికెట్‌తో బుమ్రా మొదలు పెట్టాడు... ఆ తర్వాత వచ్చిన సిరాజ్ తన మొదటి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసి ప్రమాద సూచిక ప్రదర్శించాడు... ఆ తర్వాత అతని రెండో ఓవర్లో అసలు విధ్వంసం జరిగింది. ఒకటి, రెండు కాదు... ఏకంగా నాలుగు వికెట్లు అతని ఖాతాలో...
తన మరుసటి ఓవర్లోనూ ఇదే కొనసాగిస్తూ మరో వికెట్... శ్రీలంక స్కోరు 12/6. అయితే అందులో ఐదు వికెట్లు సిరాజ్‌వే... కొంత విరామం తర్వాత మరో వికెట్ కూడా అతని ఖాతాలోనే ... 7 ఓవర్లు వేశాక అదే జోరుతో మళ్లీ బంతిని అందుకునేందుకు సిద్ధమైనా కెపె్టన్ ఇక చాలని వారించాడు... తర్వాతి మూడు వికెట్లతో హార్దిక్ (3/3) ప్రత్యర్థి ఆట ముగించాడు. 50 ఓవర్ల లంక ఇన్నింగ్స్ కాస్తా 50 పరుగుల ఇన్నింగ్స్‌గా మారిపోయింది!
కొలంబో: హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగాడు. టెస్టు క్రికెట్‌ను గుర్తుకు తెచ్చేలా పదునైన స్వింగ్ బౌలింగ్‌తో సత్తా చాటిన అతని ధాటిని తట్టుకోలేక శ్రీలంక బ్యాటింగ్ కుప్పకూలింది. సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో అలవోకగా టీమిండియా ఆసియా చాంపియన్‌గా నిలిచింది. సొంతగడ్డపై కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయిన లంక పలు చెత్త రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది.
ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (34 బంతుల్లో 17; 3 ఫోర్లు), దుషాన్ హేమంత (15 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (6/21) ఆరు వికెట్లతో లంకను దెబ్బకొట్టాడు.
అనంతరం భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (19 బంతుల్లో 27 నాటౌట్; 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) మ్యాచ్ ముగించారు. ఒకదశలో 12/6తో లంక వన్డేల్లో అత్యల్ప స్కోరు (35; జింబాబ్వే) నమోదు చేస్తుందేమో అనిపించినా చివరకు ఆ గండం దాటింది. టోచ్చిలో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) జడేజా (బి) సిరాజ్ 2; కుశాల్ పెరీరా (సి) రాహుల్ (బి) బుమ్రా 0; కుశాల్ మెండిస్ (బి) సిరాజ్ 17; సమరవిక్రమ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; అసలంక (సి) ఇషాన్ కిషన్ (బి) సిరాజ్ 0; ధనంజయ డిసిల్వా (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; షనక (బి) సిరాజ్ 0; వెలలాగె (సి) రాహుల్ (బి) హార్దిక్ పాండ్యా 8; దుషాన్ హేమంత (నాటౌట్) 13; మదుషన్ (సి) కోహ్లి (బి) హార్దిక్ పాండ్యా 1; పతిరణ (సి) ఇషాన్ కిషన్ (బి) హార్దిక్ పాండ్యా 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో ఆలౌట్) 50. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–8, 4–8, 5–12, 6–12, 7–33, 8–40, 9–50, 10–50. బౌలింగ్: బుమ్రా 5–1–23–1, సిరాజ్ 7–1–21–6, హార్దిక్ పాండ్యా 2.2–0–3–3, కుల్దీప్ యాదవ్ 1–0–1–0.
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 23; గిల్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 51. బౌలింగ్: మదుషన్ 2–0–21–0, పతిరణ 2–0–21–0, వెలలాగె 2–0–7–0, అసలంక 0.1–0–1–0.
Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023
Comments
Please login to add a commentAdd a comment