సాయి సుదర్శన్‌ పోరాటం వృధా.. దులీప్‌ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ | India A Wins Duleep Trophy Title After Win Vs IND C | Sakshi
Sakshi News home page

సాయి సుదర్శన్‌ పోరాటం వృధా.. దులీప్‌ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ

Published Sun, Sep 22 2024 6:13 PM | Last Updated on Sun, Sep 22 2024 7:20 PM

India A Wins Duleep Trophy Title After Win Vs IND C

2024 దులీప్‌ ట్రోఫీని ఇండియా-ఏ జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్‌ 22) ముగిసిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో ఇండియా-ఏ.. ఇండియా-సిపై 132 పరుగుల తేడాతో గెలుపొంది, టైటిల్‌ చేజిక్కించుకుంది.

350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. ప్రసిద్ద్‌ కృష్ణ (3/50), తనుశ్‌ కోటియన్‌ (3/47), ఆకిబ్‌ ఖాన్‌ (2/26), షమ్స్‌ ములానీ (1/46) ధాటికి 217 పరుగులకే కుప్పకూలింది. 

సాయి సుదర్శన్‌ సెంచరీతో (111) వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం​ లేకుండా పోయింది. అతనికి జట్టులో ఎవ్వరి నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్‌ రుతురాజ్‌ ఒక్కడు (44) కాస్త పర్వాలేదనించాడు. గుర్తింపు ఉన్న ఆటగాళ్లు రజత్‌ పాటిదార్‌ (7), ఇషాన్‌ కిషన్‌ (17), అభిషేక్‌ పోరెల్‌ (0) నిరాశపరిచారు.

శాశ్వత్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో తొలుత తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఏ.. 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్‌‌ రావత్‌ సెంచరీతో (124) కదంతొక్కగా.. ఆవేశ్‌ ఖాన్‌ అజేయ అర్ద సెంచరీతో (51) రాణించాడు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాక్‌ 4, అన్షుల్‌ కంబోజ్‌ 3, గౌరవ్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు.

నిరాశపరిచిన రుతురాజ్‌, ఇషాన్‌
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-సి.. 234 పరుగులకే ఆలౌటైంది. స్టార్‌ బ్యాటర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (17), సాయి సుదర్శన్‌ (17), రజత్‌ పాటిదార్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (5) నిరాశపరచగా..  అభిషేక్‌ పోరెల్‌ ఒక్కడే అర్ద సెంచరీతో (82) రాణించాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌, ఆకిబ్‌ ఖాన్‌ తలో 3, షమ్స్‌ ములానీ 2, తనుశ్‌ కోటియన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

రాణించిన రియాన్‌
63 పరుగుల ఆధిక్యంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-ఏ..రియాన్‌ పరాగ్‌ (73), శాశ్వత్‌ రావత్‌ (53) అర్ద సెంచరీలతో రాణంచడంతో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కుషాగ్రా (42), మయాంక్‌ అగర్వాల్‌ (34), తనుశ్‌ కోటియన్‌ (26 నాటౌట్‌) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్‌ యాదవ్‌ 4, అన్షుల్‌ కంబోజ్‌, మానవ్‌ సుతార్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

సాయి సుదర్శన్‌ పోరాటం వృధా
350 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-సి 217 పరుగులకే ఆలౌటై, 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయి సుదర్శన్‌ (111) ఒంటరి పోరాటం చేసి ఇండియా-సిని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.

రన్నరప్‌గా నిలిచిన ఇండియా-సి
మూడు రౌండ్ల మ్యాచ్‌లు ముగిశాక 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా-ఏ  టైటిల్‌ గెలుచుకోగా.. 9 పాయింట్లు సాధించిన ఇండియా-సి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.  

చదవండి: Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్‌.. ఇండియా-డి ఘన విజయం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement