హోవ్: ఇంగ్లండ్ చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ముందుగా పదునైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును కట్టడి చేసిన టీమ్... ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్ల అర్ధ సెంచరీలతో అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళలను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది.
అలైస్ డేవిడ్‌సన్ (61 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... డానీ వ్యాట్ (43; 3 ఫోర్లు), సోఫీ ఎకెల్‌స్టోన్ (31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఒక దశలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆరో వికెట్ చేజార్చుకునే సమయానికి 128 వద్ద నిలిచింది. అయితే ఏడో వికెట్‌కు వ్యాట్‌తో 50 పరుగులు, ఎనిమిదో వికెట్‌కు ఎకెల్‌స్టోన్‌తో 49 పరుగులు జోడించి అలైస్ తమ జట్టును ఆదుకుంది.
ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం నెమ్మదిగా ఆడిన ఇంగ్లండ్ చివరి 6 ఓవర్లలో మాత్రం 45 పరుగులు సాధించింది. దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కగా... జులన్ గోస్వామి, హర్లీన్, రాజేశ్వరి, మేఘన, స్నేహ్ రాణా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 44.2 ఓవర్లలో 3 వికెట్లకు 232 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (99 బంతుల్లో 91; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (94 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (47 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. యస్తికతో రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించిన స్మృతి, హర్మన్‌తో మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా, రెండో వన్డే బుధవారం కాంటర్‌బరీలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment