రెండో టెస్టులోనూ భారత్ ఘన విజయం
7 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు
రాణించిన బౌలర్లు, జైస్వాల్
సిరీస్ 2–0తో టీమిండియా సొంతం
ఆదివారం గ్వాలియర్‌లో తొలి టి20 మ్యాచ్
భారత జట్టు లెక్క తప్పలేదు. చివరి రోజు బంగ్లాదేశ్‌ను సాధ్యమైనంత వేగంగా ఆలౌట్ చేసి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధమైన టీమిండియా సరిగ్గా అదే చేసి చూపించింది. భారత బౌలింగ్ దెబ్బకు నిలబడలేకపోయిన బంగ్లా ఆట ఒక్క సెషన్‌లోనే ముగియగా... లంచ్ విరామం తర్వాత గంట వ్యవధిలో రోహిత్ బృందం పని పూర్తి చేసింది.
వర్షంతో ఏకంగా ఎనిమిది సెషన్ల పాటు ఆట తుడిచి పెట్టుకుపోయినా... ఆరు సెషన్ల ఆటలోనే ఫలితం రాబట్టి భారత్ తమ స్థాయిని ప్రదర్శించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం కోసమే ఆడతామంటూ నిరూపించిన జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
కాన్పూర్: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఫలితం వచ్చే అవకాశం కనిపించని మ్యాచ్‌నూ తమ సాహసోపేత ఆటతో మలుపు తిప్పిన జట్టు చివరకు తాము అనుకున్న ఫలితం సాధించింది. మంగళవారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 26/2తో తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.
షాద్‌మన్ ఇస్లామ్ (101 బంతుల్లో 50; 10 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్ (63 బంతుల్లో 37; 7 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. బుమ్రా, జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 95 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి భారత్ విజయాన్నందుకుంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 51; 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) సునాయాసంగా జట్టును గెలిపించారు. అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది. తొలి టి20 మ్యాచ్‌కు గ్వాలియర్ ఆతిథ్యమిస్తుంది.
సమష్టి వైఫల్యం...
నాలుగో రోజు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ముగించేందుకు భారత్‌కు 36 ఓవర్లు సరిపోయాయి. షాద్‌మన్, నజు్మల్ హసన్ (19) నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించి కొద్దిసేపు ప్రతిఘటించడం మినహా బంగ్లా బ్యాటర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆట మొదలయ్యాక మూడో ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మోమినుల్ హక్ (2)ను అశ్విన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. ఈ దశలో షాద్‌మన్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.
అశ్విన్, సిరాజ్ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే జడేజా తన తొలి ఓవర్లోనే నజు్మల్‌ను వెనక్కి పంపి ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో 97 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షాద్‌మన్ తర్వాతి ఆకాశ్‌దీప్ వేసిన తర్వాతి ఓవర్లో పెవిలియన్ చేరాడు. అంతే... ఆ తర్వాత మిగిలిన ఐదు వికెట్లు టపటపా పడిపోయాయి.
బంగ్లా ఆశలు పెట్టుకున్న ప్రధాన బ్యాటర్లు లిటన్ దాస్ (1), షకీబ్ (0) ఒకే స్కోరు వద్ద అవుటయ్యారు. జడేజా తాను వేసిన తొలి మూడు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున తీయడం విశేషం. మిరాజ్ (9), తైజుల్ (0) విఫలం కాగా... మరో ఎండ్‌లో ముషి్ఫకర్ చివరి వరకు పోరాడాడు. అయితే బుమ్రా అద్భుత బంతితో ముషి్ఫకర్ స్టంప్స్‌ను ఎగరగొట్టడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.
జైస్వాల్ జోరు...
ముగ్గురు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించి బంగ్లా తమ వంతుగా కొంత ప్రయత్నం చేసినా భారత్ ముందు అది పనికి రాలేదు. స్వల్ప ఛేదనలో రోహిత్ శర్మ (8), శుబ్‌మన్ గిల్ (6) విఫలమైనా... జైస్వాల్ మరోసారి తనదైన శైలిలో బౌండరీలతో దూసుకుపోయాడు. షకీబ్, మిరాజ్ ఓవర్లలో రెండేసి ఫోర్లతో అతను జోరు ప్రదర్శించాడు.
మరో ఎండ్‌లో కోహ్లి అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 58 పరుగులు జత చేశారు. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన జైస్వాల్ విజయానికి మూడు పరుగుల దూరంలో వెనుదిరిగాడు. తైజుల్ వేసిన బంతిని మిడాన్ దిశగా ఫోర్ కొట్టి రిషభ్ పంత్ (4 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
18 సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం. 2013లో ఆ్రస్టేలియాను 4–0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఇది మొదలైంది. చివరిసారి భారత జట్టు 2012లో స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోయింది.
13 బంగ్లాదేశ్‌పై ఆడిన 15 టెస్టుల్లో భారత్‌కు ఇది 13వ విజయం. మిగిలిన 2 మ్యాచ్‌లు ‘డ్రా’ కాగా, భారత్ ఒక్క టెస్టు కూడా ఓడలేదు.
11 టెస్టుల్లో అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ల సంఖ్య. మురళీధరన్ (11)తో సమంగా అతను అగ్రస్థానంలో నిలిచాడు.
నాలుగో రోజు ఆట మొదలవడానికి ముందు బంగ్లాదేశ్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేసి ఆ తర్వాత బ్యాటింగ్‌తో ఏం చేయగలమా అని ఆలోచించాం. మేం పరుగులు సాధించడంకంటే వారిని పడగొట్టేందుకు ఎన్ని ఓవర్లు అవసరం అవుతాయి అన్నట్లుగానే మా లెక్క సాగింది. పిచ్ బౌలింగ్‌కు పెద్దగా అనుకూలించకున్నా మా బౌలర్లు మంచి ఫలితం సాధించారు.
రెండున్నర రోజుల ఆట కోల్పోయాం కాబట్టి ఇకపై సాహసోపేతంగా ఆడి ఫలితాన్ని రాబట్టేందుకు బ్యాటర్లంతా సై అన్నారు. ఇలాంటప్పుడు జట్టు కుప్పకూలే అవకాశం కూడా ఉంటుంది. అయినా సరే 100–120 పరుగులకు ఆలౌట్ అయ్యేందుకు కూడా సిద్ధపడే దూకుడు ప్రదర్శించాం.
కోచ్ గంభీర్‌తో గతంలో కలిసి ఆడిన అనుభవం ఉంది కాబట్టి అతని శైలి గురించి బాగా తెలుసు. ఇప్పటి వరకు అంతా బాగుంది. ద్రవిడ్ ఉన్నప్పుడు కూడా చక్కగా కలిసి పని చేశాం. అయితే జీవితం సాగిపోతూ ఉంటుంది. అలాగే జట్టు కూడా ముందుకు సాగిపోవాలి. – రోహిత్ శర్మ, భారత కెప్టెన్
షకీబ్‌కు కోహ్లి బ్యాట్ బహుమతి
కాన్పూర్: త్వరలో రిటైరవుతున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబుల్ హసన్‌కు భారత స్టార్ విరాట్ కోహ్లి తన బ్యాట్‌ను కానుకగా అందజేశాడు. షకీబ్ టెస్టు ఫార్మాట్‌పై ఇది వరకే తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్‌బై చెబుతానన్నాడు.
వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పే యోచన లో ఉన్నాడు. రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లి స్వయంగా బంగ్లాదేశ్ జట్టు వద్దకు వెళ్లి తన గుర్తుగా బంగ్లా మేటి క్రికెటర్ అయిన షకీబ్‌కు బ్యాట్‌ను బహూకరించాడు. ఈ సందర్భంగా ఇరు జట్ల హేమాహేమీలు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.
షకీబ్ స్టార్ ఆల్‌రౌండర్. బంగ్లాదేశ్‌కే కాదు... మన ఐపీఎల్ అభిమానులకు చిరపరిచితుడు. అతను కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున 71 మ్యాచ్‌లాడాడు.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 233; భారత్ తొలి ఇన్నింగ్స్: 285/9 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్‌మన్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 50; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 2; నజ్ముల్ హసన్ (బి) జడేజా 19; ముషి్ఫకర్ (బి) బుమ్రా 37; లిటన్ దాస్ (సి) పంత్ (బి) జడేజా 1; షకీబ్ (సి అండ్ బి) జడేజా 0; మిరాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 9; తైజుల్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖాలెద్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–18, 2–26, 3–36, 4–91, 5–93, 6–94, 7–94, 8–118, 9–130, 10–146. బౌలింగ్: బుమ్రా 10–5–17–3, అశ్విన్ 15–3–50–3, ఆకాశ్‌దీప్ 8–3–20–1, సిరాజ్ 4–0–19–0, జడేజా 10–2–34–3.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) మహమూద్ (బి) మిరాజ్ 8; జైస్వాల్ (సి) షకీబ్ (బి) తైజుల్ 51; గిల్ (ఎల్బీ) (బి) మిరాజ్ 6; కోహ్లి (నాటౌట్) 29; పంత్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–18, 2–34, 3–92. బౌలింగ్: మెహదీ హసన్ మిరాజ్ 9–0–44–2, షకీబ్ 3–0–18–0, తైజుల్ 5.2–0–36–1.
Comments
Please login to add a commentAdd a comment