
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న భారత దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తొలుత సచిన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆతరువాత యూసఫ్ పఠాన్, తాజాగా సుబ్రమణ్యం బద్రీనాధ్ వైరస్ పీడిత జాబితాలో చేరారు. బద్రీనాధ్.. వైరస్ బారిన పడ్డ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడంతో టెస్టు చేయించుకున్నాని, కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.
తమిళనాడుకు చెందిన బద్రీనాధ్.. భారత్ తరఫున 2008-2011 మధ్యలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో వరుసగా టైటిల్‌లు సాధించడంలో బద్రీనాధ్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారత లెజెండ్స్ సభ్యుల్లో తీవ్ర కలవరం మొదలైంది. వైరస్ బారిన పడ్డ క్రికటర్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment