శ్రీలంకతో భారత్ ఆఖరి పోరు నేడు
సమరోత్సాహంతో సూర్యసేన
ఒత్తిడిలో అసలంక బృందం
రాత్రి 7 గంటల నుంచి ‘సోనీ’ నెట్‌వర్క్‌లో ప్రసారం
పల్లెకెలె: భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు గెలిచింది. టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు దీన్ని 3–0గా వైట్‌వాష్ చేసేందుకు భారత్ ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య శ్రీలంకపై ముచ్చటగా మూడో విజయం సాధించేందుకు సూర్యకుమార్ బృందం తహతహలాడుతోంది.
మంగళవారం జరిగే మూడో టి20 బరిలోకి టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ‘హ్యాట్రిక్’ గెలుపుపై ఎవరికి అనుమానాల్లేవ్! మరోవైపు లంక సొంతగడ్డపై పరువు కోసం పాకులాడుతోంది. కనీసం ఆఖరి పోరులో గెలిచి క్లీన్‌స్వీప్ కాకుండా బయటపడాలని ఆరాటపడుతోంది.
టీమిండియాకు ఎదురుందా...
ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. గిల్ స్థానంలో రెండో టి20 ఆడిన సంజూ సామ్సన్ డకౌట్‌ను మరిచేలా మెరిపిస్తే ఇన్నింగ్స్‌కు ఢోకా ఉండదు. సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు మిగతా పని కానిచ్చేస్తారు. బౌలర్లు అర్‡్షదీప్, అక్షర్, రవి బిష్ణోయ్, సిరాజ్‌లు కూడా నిలకడగా రాణిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో దూసుకెళ్తున్న లంక ఇన్నింగ్స్‌ను 30 పరుగుల వ్యవధిలో 9 వికెట్లను కూల్చారు. రెండో మ్యాచ్‌లో 32 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను తీసిన టీమిండియా బౌలింగ్ దళం సత్తాచాటుకుంది.
ఈ ఒక్కటైనా గెలవాలని...
సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక ఆఖరి పోరులో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. వచ్చే నెల 2 నుంచి జరిగే వన్డే సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలని ఆశిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్ ఆతిథ్య జట్టుకు తలనొప్పిగా మారింది.
భారత్ నుంచి వైట్‌వాష్ తప్పించుకోవాలంటే మాత్రం వ్యూహాలకు పదును పెట్టాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఓపెనర్ నిసాంక మాత్రమే రెండు మ్యాచ్‌ల్లో కుదురుగా ఆడాడు. మిగతా వారంతా భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోతున్నారు. ఇకపై లోపాలను అధిగమించి విజయాన్నందుకోవాలని లంక సేన పట్టుదలతో ఉంది.
పిచ్, వాతావరణం
వేదిక మారలేదు కానీ గత రెండు మ్యాచ్‌లు ఆడిన పిచ్‌పై కాకుండా వేరే పిచ్‌పై ఈ మ్యాచ్ జరుగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలమే అలాగే స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్. వర్ష సూచన ఉన్నప్పటికీ మ్యాచ్ జరుగుతుంది.
జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, సంజూ సామ్సన్, రిషభ్ పంత్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, పరాగ్, అక్షర్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, సిరాజ్.
శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, పెరీరా, కమిండు మెండీస్, షనక, హసరంగ, తీక్షణ, పతిరణ, మదుషంక, ఫెర్నాండో.
Comments
Please login to add a commentAdd a comment