
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ చివరి ప్రాక్టీస్ మ్యాచ్
విమాన ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించిన టీమిండియా
బెకెన్‌హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు నాలుగు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కాగా... ఆట ఆరంభానికి ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు భారత జట్టు నివాళులర్పించింది. దీనికి సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఎయిరిండియా ఏఐ–171 విమాన ప్రమాదంలో మృతిచెందిన 265 మందికి సంతాపంగా ఆటగాళ్లంతా చేతులకు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. మరోవైపు లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా ఈ ప్రమాదమృతులకు ఒక నిమిషం పాటు మౌనం వహించి సంతాపం తెలిపారు.
ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ జట్టు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆటగాళ్లతో కలుపుకొని ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు అభిమానులు, మీడియాకు అనుమతి లేదు.