బాలీ: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. టోర్నీ రెండో సీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 14–21, 21–19, 21–16తో విక్టర్ అక్సెల్‌సన్‌పై గెలుపొందాడు.
71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్... రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అద్భుతమైన స్మాష్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు, మూడు గేమ్‌ల్లో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. విక్టర్ అక్సెల్‌సన్‌పై ప్రణయ్‌కిదే తొలి విజయం. గతంలో అతడితో ఆడిన ఐదు సార్లు కూడా ప్రణయ్ ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 13–21, 21–18, 21–15తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గగా... లక్ష్యసేన్ 13–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడాడు.
మహిళల పిక్వ్రార్టర్స్‌లో పీవీ సింధు 17–21, 21–7, 21–12 క్లారా అజుర్‌మెండి (స్పెయిన్)పై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంటను ఓడించిన సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట 15–21, 23–21, 18–21తో జోమ్‌కో–సుపిసార (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 12–21తో కిటిట్‌హరకుల్–రవిండ ప్రజోంగ్జ (థాయలాండ్) జంట చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment