స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. ఇవాళ (జూన్ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్
ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో మంధన, హర్మన్ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ పడగొట్టారు.
CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK
— Johns. (@CricCrazyJohns) June 19, 2024
చివరి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్
49వ ఓవర్ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) సమం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment