
కొత్త ముఖాలకు చోటులేదు.. ఇప్పటికైనా మారాలి: ఇంజమామ్
Inzamam ul Haq Slams Bangladesh After Whitewash Against Pakistan T20 Series: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ విమర్శల వర్షం కురిపించాడు. సుదీర్ఘకాలంగా ఒకే జట్టును బరిలోకి దించుతున్నారని.. కొత్త వాళ్లకు అవకాశమే ఇవ్వడం లేదన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేయడం లేదని.. ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి తగిన మార్పులు చేస్తే మెరుగైన ఫలితాలు చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత.. పాకిస్తాన్ వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది. ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో చివరి బంతికి మొహమ్మద్ నవాజ్ ఫోర్ బాదడంతో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆట తీరుపై ఇంజమామ్ పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలంటే.. ఇప్పటికీ ముగ్గురు.. నలుగురు ఆటగాళ్లపైనే ఆధారపడుతోంది. గత ఆరేడేళ్లుగా ఇదే పరిస్థితి. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా వారు మారడం లేదు. కొత్త ముఖాలు కనిపించడం లేదు.
కొంతమంది కీలక ఆటగాళ్లు(షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఉద్దేశించి) కూడా ఈ సిరీస్ ఆడలేదు... ఇప్పటికైనా బంగ్లాదేశ్ క్రికెట్‌లో మార్పు రావాలి. ఆటను అభివృద్ధిపరచడంపై దృష్టి సారించాలి’’ అని హితవు పలికాడు. ఇక వైట్‌వాష్ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసలు కురిపించిన ఇంజమామ్... రోజురోజుకీ సారథిగా బాబర్ ఎంతో ఇంప్రూవ్ అవుతున్నాడని కితాబిచ్చాడు.