రోహిత్‌ మెరుపులు.. ముంబై భారీ స్కోరు | IPL 2020 : Mumbai Indians Set 196 Runs Target To KKR | Sakshi
Sakshi News home page

రోహిత్‌ మెరుపులు.. ముంబై భారీ స్కోరు

Published Wed, Sep 23 2020 9:42 PM | Last Updated on Wed, Sep 23 2020 10:34 PM

IPL 2020 : Mumbai Indians Set 196 Runs Target To KKR - Sakshi

అబుదాబి: ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపులతో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఏంచుకున్న కోల్‌కతాకు రోహిత్‌ శర్మ తన ఇన్నింగ్స్‌తో చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్‌ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. రోహిత్‌ ఇన్నింగ్స్‌లో 3ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. (చదవండి : సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్‌.. ముంబై స్కోరెంతంటే)

క్వింటన్‌ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌ మొదటి ఓవర్‌లోనే సిక్స్‌ బాదాడు. అయితే తర్వాతి ఓవర్లో శివమ్‌ మావి బౌలింగ్‌లో డికాక్‌ బారీ షాట్‌కు యత్నించిన డికాక్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీనికి తోడు హిట్‌మాన్‌ కూడా సిక్సర్లతో రెచ్చిపోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 6 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. రోహిత్‌కు జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు 10కి పైగా రన్‌రేట్‌తో ఉరకలెత్తింది.

ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 10.2 ఓవర్లలో 98 పరుగులకు చేరగానే సూర్యకుమార్‌ యాదవ్‌ 47 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సౌరబ్‌ తివారి 13 బంతుల్లో 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌లో తన వంతు పాత్ర పోషించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న రోహిత్‌ బారీ షాట్‌కు ప్రయత్నించి శివమ్‌ మావి బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చివెనుదిరిగాడు. వెంటనే 18 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. రోహిత్‌ ఇన్నింగ్స్‌తో ముంబై స్కోరు 200 దాటుతుందని భావించగా చివర్లో కేకేఆర్‌ బౌలర్లు కట్టడి చేయడంతో 195 పరుగులు చేయగలిగింది.  

ఇక కేకేఆర్‌ బౌలర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. కాగా గతేడాది జరిగిన వేలంలో రూ. 15 కోట్లు పెట్టి కొన్న పాట్‌ కమిన్స్‌ 3 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. కేకేఆర్‌ బౌలర్లలో శివమ్‌ మావి రెండు, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ చెరో వికెట్‌ తీశారు. (చదవండి : 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement