డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో పూర్తి ఫామ్‌లోకి వచ్చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదు చేసిన రోహిత్ సేన లక్ష్యాన్ని కాపాడుకుంటూ ‘హ్యాట్రిక్’ విజయాన్ని సాధించింది. ముందుగా సూర్యకుమార్ యాదవ్ జోరైన ఇన్నింగ్స్‌కు రోహిత్, హార్దిక్ సహకారం తోడు కావడంతో పటిష్ట స్థితికి చేరిన జట్టు... బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టిపడేసింది. మరోవైపు ఒక వ్యూహం, సరైన ప్రణాళిక లేకుండా బరిలోకి దిగుతున్న రాజస్తాన్ రాయల్స్‌కు కూడా ఇది వరుసగా మూడో పరాజయం. ప్రధాన బౌలర్లంతా విఫలమై పరుగులు సమర్పించుకున్న చోట బ్యాటింగ్‌లో కూడా ఆ జట్టు కుప్పకూలింది. బట్లర్ కొన్ని మెరుపులు మెరిపించినా... మొత్తంగా రాయల్స్ బ్యాటింగ్ బలహీనత మళ్లీ బయటపడింది.
అబుదాబి: సమష్టి ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై 57 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య కుమార్ యాదవ్ (47 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... రోహిత్ శర్మ (23 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. జాస్ బట్లర్ (44 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బుమ్రా (4/20) పదునైన బౌలింగ్‌లో దెబ్బ తీయగా... ప్యాటిన్సన్, బౌల్ట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.
భారీ భాగస్వామ్యం...
ముంబై జట్టుకు డికాక్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ కలిసి శుభారంభం అందించారు. ముఖ్యంగా అంకిత్ రాజ్‌పుత్ తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి 4 ఫోర్లు, సిక్స్ బాదడంతో 25 పరుగులు వచ్చాయి. ఆర్చర్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన డికాక్‌ను త్యాగి వెనక్కి పంపాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 57 పరుగులు చేసింది. అనంతరం గోపాల్ వేసిన పదో ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కాస్త ఒత్తిడిలో పడింది. వరుస బంతుల్లో రోహిత్, ఇషాన్ కిషన్ (0)లను గోపాల్ అవుట్ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన కృనాల్ పాండ్యా (12) క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇబ్బందిగా ఆడి వెనుదిరిగాడు. ఈ దశలో సూర్యకుమార్, హార్దిక్ భాగస్వామ్యం ముంబైకి భారీ స్కోరును అందించింది. ఒకవైపు సూర్య చెలరేగగా, హార్దిక్ అతనికి తగిన సహకారం అందించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 38 బంతుల్లోనే అభేద్యంగా 76 పరుగులు జోడించడం విశేషం.
మరో కుర్రాడు...
ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ ఆడిన భారత జట్టు నుంచి మరో ఆటగాడు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. పేస్ బౌలర్ కార్తీక్ త్యాగికి రాజస్తాన్ అవకాశమిచ్చింది. ఇప్పటికే ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్, ప్రియమ్ గార్గ్, రవి బిష్ణోయ్ ఆడుతున్నారు. తొలి ఓవర్లోనే డికాక్‌ను అవుట్ చేసి త్యాగి వికెట్ల ఖాతా తెరిచాడు. ‘త్యాగి రనప్ బ్రెట్‌లీ లా, డెలివరీ స్ట్రయిడ్ ఇషాంత్ శర్మ’లా ఉంది అంటూ రాయల్స్ జట్టు సహచరుడు, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అతని గురించి అభిప్రాయపడ్డాడు.
బట్లర్ మినహా...
భారీ లక్ష్య ఛేదనలో మూడో ఓవర్ కూడా పూర్తి కాకముందే రాజస్తాన్ ఓటమి ఖాయమని, మిగతాదంతా లాంఛనమే అనిపించింది. చివరకు అదే జరిగింది. ఓవర్‌కు ఒకరు చొప్పున యశస్వి (0), స్టీవ్ స్మిత్ (6), సంజూ సామ్సన్ (0) వెనుదిరిగారు. పవర్‌ప్లేలో రాయల్స్ స్కోరు 31 పరుగులు మాత్రమే. అనంతరం మహిపాల్ లోమ్రోర్ (11), టామ్ కరన్ (15) కూడా విఫలమయ్యారు. ఓపెనర్ బట్లర్ ఒక్కడే పోరాడినా, అది జట్టుకు ఉపయోగపడలేదు. గత మూడు మ్యాచ్‌లలోనూ విఫలమైన బట్లర్... ఈసారి దూకుడుగా ఆడగా, మరోవైపు నుంచి అతనికి కనీస సహకారం లభించలేదు. ఒక దశలో 16 బంతుల వ్యవధిలోనే ఐదు సిక్సర్లు బాదిన బట్లర్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరకు లాంగాన్ బౌండరీ వద్ద పొలార్డ్ ఒంటి చేత్తో పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత రాయల్స్ గెలుపుపై ఎలాంటి ఆశలు పెట్టుకునేందుకు అవకాశం లేకపోయింది. ఆర్చర్ (11 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కొద్ది సేపు నిలబడినా, మరో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఆట ముగిసింది.
సూర్య స్పెషల్...
ఐపీఎల్‌లో అనేకసార్లు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడినా... ఇప్పటి వరకు భారత సెలక్టర్ల విశ్వాసం పొందలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ మరో మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. మూడో స్థానంలో ఆడిన అతని బ్యాటింగ్ వల్లే ముంబై మెరుగైన స్థితికి చేరింది. త్యాగి వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను గోపాల్ బౌలింగ్‌లో మరో రెండు చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. ఆర్చర్ బౌలింగ్‌లో షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన ఫోర్‌కు సచిన్ సైతం ‘ట్విట్టర్’లో ప్రశంసలు కురిపించాడు. 33 బంతుల్లోనే సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. 19వ ఓవర్లో ఆర్చర్ వేసిన పదునైన బౌన్సర్ నేరుగా తన తలకు తగలడంతో సూర్య కొద్దిసేపు బాగా ఇబ్బంది పడ్డాడు. సహచరుల్లో కూడా ఆందోళన కనిపించింది. అయితే స్వల్ప చికిత్సతో కోలుకున్న అతను, స్థయిర్యం కోల్పోకుండా తర్వాతి బంతినే అద్భుత రీతిలో ‘స్కూప్’ ద్వారా సిక్సర్‌గా మలచి బౌలర్‌కు తగిన జవాబిచ్చాడు. ఐపీఎల్‌లో యాదవ్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) బట్లర్ (బి) త్యాగి 23; రోహిత్ (సి) తేవటియా (బి) గోపాల్ 35; సూర్యకుమార్ (నాటౌట్) 79; ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) గోపాల్ 0; కృనాల్ (సి) గోపాల్ (బి) ఆర్చర్ 12; హార్దిక్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 193.
వికెట్ల పతనం: 1–49; 2–88; 3–88; 4–117. బౌలింగ్: అంకిత్ 3–0–42–0; గోపాల్ 4–0– 28–2; ఆర్చర్ 4–0–34–1; కార్తీక్ త్యాగి 4–0– 36–1; టామ్ కరన్ 3–0–33–0; తేవటియా 2–0– 13–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డికాక్ (బి) బౌల్ట్ 0; బట్లర్ (సి) పొలార్డ్ (బి) ప్యాటిన్సన్ 70; స్మిత్ (సి) డికాక్ (బి) బుమ్రా 6; సామ్సన్ (సి) రోహిత్ (బి) బౌల్ట్ 0; లోమ్రోర్ (సబ్) (సి) అనుకూల్ (బి) రాహుల్ చహర్ 11; టామ్ కరన్ (సి) హార్దిక్ (బి) పొలార్డ్ 15; రాహుల్ తేవటియా (బి) బుమ్రా 5; ఆర్చర్ (సి) పొలార్డ్ (బి) బుమ్రా 24; గోపాల్ (సి) డికాక్ (బి) బుమ్రా 1; రాజ్‌పుత్ (సి) రోహిత్ (బి) ప్యాటిన్సన్ 2; త్యాగి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్) 136. వికెట్ల పతనం: 1–0; 2–7; 3–12; 4–42; 5–98; 6–108; 7–113; 8–115; 9–136; 10–136. బౌలింగ్: బౌల్ట్ 4–0–26–2; బుమ్రా 4–0–20–4; ప్యాటిన్సన్ 3.1–0–19–2; రాహుల్ చహర్ 3–0–24–1; కృనాల్ 2–0–22–0; పొలార్డ్ 2–0–24–1
Comments
Please login to add a commentAdd a comment