RR Vs SRH: కేన్‌ మామ సూపర్‌ ఫిప్టీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో విజయం | IPL 2021 2nd Phase SRH Vs RR Match Live And Updates | Sakshi
Sakshi News home page

IPl 2021 2nd Phase RR Vs SRH:కేన్‌ మామ సూపర్‌ ఫిప్టీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో విజయం

Published Mon, Sep 27 2021 6:57 PM | Last Updated on Mon, Sep 27 2021 11:01 PM

IPL 2021 2nd Phase SRH Vs RR Match Live And Updates - Sakshi

Photo Courtesy: IPL

కేన్‌ మామ సూపర్‌ ఫిప్టీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో విజయం
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆఖరి వరకు నిలిచి సూపర్ ఫిప్టీతో ఆకట్టుకొని మ్యాచ్‌ను గెలిపించాడు. అంతకముందు జేసన్‌ రాయ్‌ 60 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అభిషేక్‌ శర్మ  21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.  165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌, లామ్రోర్‌, సకారియా తలా ఒక వికెట్‌ తీశారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన  రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ 82 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్‌ 36, లామ్రోర్‌ 29 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. కౌల్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ప్రియమ్‌ గార్గ్‌ గోల్డెన్‌ డక్‌.. 124/3
ఎస్‌ఆర్‌హెచ్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో ప్రియమ్‌ గార్గ్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకంతో మెరిసిన జేసన్‌రాయ్‌ చేతన్‌ సకారియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 32, అభిషేక్‌ శర్మ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాల్సి ఉంది.

జేసన్‌ రాయ్‌ మెరుపు అర్థశతకం.. 111/1
ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రాజస్తాన్‌ బౌలర్లను చీల్చి చెండాడుతున్న రాయ్‌ దాటిగా ఆడుతూ ఎస్‌ఆర్‌హెచ్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 111 పరుగులు చేసింది. రాయ్‌ 59, విలియమ్సన్‌ 23 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 63/1
ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా 18 పరుగుల వద్ద స్టంపౌట్‌ అయ్యాడు. లామ్రోర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ తొలి బంతికే సాహా వెనుదిరిగాడు. అంతకముందు ఓవర్‌లో జేసన్‌ రాయ్‌ మెరుపులు మెరిపించాడు. క్రిస్‌ మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5 ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదిన రాయ్‌ ఓవర్‌ మొత్తంగా 18 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 63 పరుగులు చేసింది. రాయ్‌ 31, విలియమ్సన్‌ 6 క్రీజులో ఉన్నారు.

దాటిగా ఆడుతున్న సన్‌రైజర్స్‌.. 3 ఓవర్లలో 26/0
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దాటిగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సాహా 18, జేసన్‌ రాయ్‌ 7 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.


Photo Courtesy: IPL

శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 165 
ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన సిద్దార్ద్‌ కౌల్‌.. రాజస్తాన్‌ భారీ స్కోర్‌ ఆశలకు గండి కొట్టాడు. చివరి ఓవర్‌ కట్టుదిట్టంగా బౌల్‌ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 20వ ఓవర్‌ రెండో బంతికి శాంసన్‌(57 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఔట్‌ చేసిన కౌల్‌.. నాలుగో బంతికి రియాన్‌ పరాగ్‌ను డకౌట్‌ చేశాడు. ఫలితంగా రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. కౌల్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

శాంసన్‌ నిలకడ.. రాజస్తాన్‌ స్కోరు 102/3
రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ నిలకడైన ఆటతీరు కొనసాగిస్తున్నాడు. 40 పరుగులతో మంచి టచ్‌లో కనిపిస్తుండగా.. మహిపాల్‌ లామ్రోర్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్ల ఆట ముగిసేసరికి రాజస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 

మూడో వికెట్‌ డౌన్‌.. రాజస్తాన్‌ 77/3
లివింగ్‌స్టోన్‌ రూపంలో రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించిన లివింగ్‌స్టోన్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 10.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్‌(30) ఉన్నాడు. అంతకముందు 36 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ సందీప్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. లూయిస్‌ వెనుదిరిగిన తర్వాత శాంసన్‌, జైశ్వాల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్తాన్‌ స్కోరు 49/1
పవర్‌ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది. ఇన్‌ఫాం బ్యాటర్‌.. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(19), ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(24) నిలకడగా ఆడుతున్నారు. అంతకముందు ఎవిన్‌ లూయిస్‌ ఆరు పరుగులు చేసి భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.


Photo Courtesy: IPL

విధ్వంసకర బ్యాటర్‌ లూయిస్‌ ఔట్‌.. రాజస్తాన్‌.. 11/1
విధ్వంసకర ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ రూపంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది.  6 పరుగులు చేసిన లూయిస్‌ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. భువనేశ్వర్‌ వేసిన డెలివరీని డీప్‌ స్వేర్‌లెగ్‌ దిశగా షాట్‌ ఆడగా.. అక్కడే ఉన్న సమద్‌ సింపుల్‌గా క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ 2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 11 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్‌(5), శాంసన్‌(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తాను ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌ విజయం సాధించి.. ఎనిమిదింటిలో ఓడిపోయి ఆఖరిస్థానంలో ఉండగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి.. ఐదింటిలో ఓడిపోయి ఆరో స్థానంలో ఉంది.

ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోతే ఇంటిబాట పట్టనుండగా.. రాజస్తాన్‌ గెలిస్తే మాత్రం ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకుంటుంది. ఇక తొలి అంచె పోటీలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు సెంచరీ(64 బంతుల్లో 124) చేయడంతో 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ వైఫల్యంతో 165 పరుగులు మాత్రమే చేసి 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరు జట్లు 14సార్లు తలపడగా.. రెండు జట్లు ఏడుసార్లు విజయం సాధించాయి. ఇక రాజస్తాన్‌ జట్టులో గాయంతో కార్తిక్‌ త్యాగి దూరమవగా.. మోరిస్‌, ఎవిన్‌ లూయిస్‌ తుది జట్టులోకి వచ్చారు. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. వార్నర్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే స్థానాల్లో జేసన్‌ రాయ్‌, అభిషేక్‌ శర్మ, ప్రియమ్‌ గార్గ్‌ తుది జట్టులోకి వచ్చారు. గాయపడిన ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌ జట్టులోకి వచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్

ఎస్‌ఆర్‌హెచ్‌: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement