
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ భరోసా ఇచ్చింది. ఐపీఎల్ టోర్నీ ముగియగానే విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు జాగ్రత్తగా పంపే బాధ్యత మాది అంటూ బీసీసీఐ మంగళవారం హామీ ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోవడం, మిగతా వాళ్లు కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో బీసీసీఐ హామీ వారికి కాస్త ఊరట కలిగించింది. ఇదే విషయమై బీసీసీఐ సీఓఓ హేమంగ్ అమిన్ స్పందించారు.
''టోర్నీ ముగిసిన తర్వాత ఎలా వెళ్లాలన్న ఆందోళన మీలో ఉన్నట్లు మాకు అర్థమైంది. దీని గురించి మీరు ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు . ఎలాంటి అడ్డంకులు లేకుండా మిమ్మల్ని మీ దేశాలకు పంపించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.
అందుకే ఐపీఎల్ ముగిసినా ప్రతీ విదేశీ ఆటగాడు తమ దేశానికి సురక్షితంగా చేరే వరకు మాకు టోర్నమెంట్ ముగిసినట్లు కాదు . ఇప్పటికే మీరు ఐపీఎల్‌లో ఆడుతూ కొన్ని కోట్ల మందికి ఎంటర్‌టైన్ అందిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల దృష్టిని మరల్చేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు... ఇది నిజంగా గొప్ప విషయం. ఒక్క నిమిషం పాటైనా ఎవరి మోములో అయినా చిరునవ్వు తీసుకురాగలిగితే మీరు మంచి పని చేసినట్లే. ఈసారి ఆడటం, గెలవడం కంటే సాయం అనే పేరుతో మీరు గొప్ప పని చేస్తున్నారంటూ'' ఆటగాళ్లలో స్పూర్తి నింపేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్‌సీబీకి చెందిన రిచర్డ్‌సన్, ఆడమ్ జంపాతో పాటు రాజస్తాన్ ఆటగాళ్లు లివింగ్ స్టోన్, ఆండ్రూ టైలు ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ ఆడలేనని.. ఈ సమయంలో కుటుంబానికి తన అవసరం ఉందంటూ వైదొలిగిన సంగతి తెలిసిందే.
చదవండి: ఐపీఎల్ ముగిసిన తర్వాత దేశానికి రానివ్వరని
Comments
Please login to add a commentAdd a comment