Photo Courtesy: IPL
ముంబై: ఐపీఎల్-14 సీజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ జరిపితీరుతామని నిన్నటి వరకూ బారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చెప్పిన మాట. కాగా, ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. దాన్ని మళ్లీ ఎప్పుడు జరుపుతామన్న విషయం క్లారిటీ ఇవ్వలేదు. కాగా, 10 రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట. ఈ రోజు (మంగళవారం, మే4) జరిగిన బీసీసీఐ గవర్నింగ్ సమావేశంలో ఇదే విషయంపై చర్చించిన తర్వాత ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా బారిన పడ్డ క్రికెటర్లకు ఫ్రాంచైజీలకు అప్పటితో క్వారంటైన్ పూర్తికానున్న నేపథ్యంలో ఐపీఎల్‌పై ముందుకెళ్లాలని బీసీసీఐ చూస్తోంది.
ఒకే వేదిక ఆప్షన్..
ఇందుకు ముంబై వేదికగా ఎంచుకుని మొత్తం మిగిలిన సీజన్‌ను జరపాలని చూస్తోంది. ముంబైలో మూడు క్రికెట్ స్టేడియాలు ఉండటంతో వాటిలోనే మిగిలిన సీజన్‌ను జరపాలని భావిస్తోంది. దాంతో ఒకే వేదికలో మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముంబైలోని స్టేడియాలకు సమీపంలో ఉన్న హోటళ్లతో సంప‍్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అహ్మదాబాద్-ఢిల్లీ- ముంబై, చెన్నైల్లో తొలి అంచె మ్యాచ్‌లు పూర్తి కాగా, రెండో అంచెలో బెంగళూరు, కోల్‌కతా కూడా ఉన్నాయి. ఇన్ని స్టేడియాల్లో బయోబబుల్‌లో మ్యాచ్‌లు నిర్వహించే కంటే ముంబైలో ఉన్న మూడు క్రికెట్ స్టేడియాల్లో మిగిలిన సీజన్ జరపడంపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ పూర్తిస్థాయి బయోబబుల్‌లో ఉంచి టోర్నీ నిర్వహించడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. బై నగరం ఒకటే భారత్‌లో మూడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్న సిటీ కాబట్టి ఇదే సరైనదిగా బీసీసీఐ యోచిస్తోంది. బాంబే జింఖానా గ్రౌండ్, బ్రబోర్న్ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ముంబైలో ఉన్నాయి.
రెండో ఆప్షన్ జూన్
ఇక బీసీసీఐ ముందు ఉన్న రెండో ఆప్షన్ జూన్. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న బీసీసీఐ.. వచ్చే నెలలో జరపడంపై కూడా యోచిస్తోంది. అలా జరిగితే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను వాయిదా వేయాలి. జూన్ 18న డబ్యూటీసీ ఫైనల్ ఆరంభం కానుంది. దీనిపై ఐసీసీని రిక్వెస్ట్ చేసి డబ్యూటీసీ ఫైనల్‌ను జూలై నెలకు వాయిదా వేయమని కోరుదామా అనేది కూడా బీసీసీఐ మదిలో ఉంది.
మూడో ఆప్షన్ యూఏఈ
ఈ రెండు సాద్యం కాకపోతే అక్టోబర్-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌కు ముందే ఐపీఎల్ మిగతా సీజన్‌ను పూర్తి చేద్దామా అనే ఆలోచన కూడా ఉంది. టీ20 వరల్డ్‌కప్ భారత్‌లో సాధ్యం కాకపోతే యూఏఈని బ్యాకప్ వేదికగా చెబుతున్న బీసీసీఐ... అక్కడే ఐపీఎల్‌ను ముగించాలని చూస్తోంది. ఈ మూడు అంశాలపైనే బీసీసీఐ సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment