ముంబై: యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 పార్ట్-2 నేపథ్యంలో బీసీసీఐ కఠిన బయోబబుల్ నిబంధనలను విడుదల చేసింది. శ్రీలంక పర్యటనలో ఎదురైన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సరికొత్త ప్రొటోకాల్స్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. లంక పర్యటనలో టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడటం, అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది క్రికెటర్లు ఐసొలేషన్‌కు వెళ్లడం, వారిలో చహల్, కృష్ణప్ప గౌతమ్‌కు వైరస్ సోకడం వంటి పరిణామాలు బీసీసీఐపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు స్పష్టమవుతోంది.
దీంతో త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 పార్ట్-2 నేపథ్యంలో బయోబబుల్‌ను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. ఉపేక్షించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీలు, క్రికెటర్లు సహా వారి కుటుంబ సభ్యులపైనా కఠిన చర్యలను తీసుకుంటామని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఐపీఎల్‌లో పాల్గొనే విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ ఊరట కల్పించింది. లీగ్‌లో పాల్గొనేందుకు వచ్చే వీరిని క్వారంటైన్‌కు తరలించదలచుకోలేదని స్పష్టం చేసింది.
అయితే వీరందరూ యుఏఈ విమానం ఎక్కడానికి కనీసం 72 గంటల ముందటి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఐపీఎల్ 2021 ఫేస్ 2తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, కరోనా సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్‌ను యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment