ముంబై: డేవిడ్ మలాన్.. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మలాన్‌కు భారీ ధర పలకడం ఖాయమని అంతా ఊహించారు. కానీ అనూహ్యంగా మలాన్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరికి పంజాబ్ కింగ్స్ మలాన్‌ను రూ. 2 కోట్ల కనీస మద్దతు ధరకు దక్కించుకుంది. అలా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మలాన్ ఇటీవలే టీమిండియాతో జరిగిన సిరీస్‌ను ముగించుకొని పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిశాడు. ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్న మలాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
''తొలిసారి ఐపీఎల్‌కు ఆడనుండడం సంతోషం కలిగిస్తుంది. నేను ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేసేసరికి ఆ జట్టులో మూడోస్థానం ఖాళీగా ఉంది.ఓపెనింగ్ చేయాలనే కోరిక బలంగా ఉండేది.. కాని అది కుదరకపోవడంతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చా .. అలా నాకు ఆ ప్లేస్ కలిసివచ్చింది. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో రాహుల్ సారధ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. తుది జట్టులో ఉంటే మాత్రం మూడో స్థానంలో ఆడుతానని కచ్చితంగా చెప్పను. అయితే మూడు, నాలుగు, ఐదు ఇలా ఏ స్థానం అయినా బ్యాటింగ్ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నా.
అయితే ఇలాంటి క్యాష్ రిచ్‌లీగ్‌లో ఆడాలన్న కోరిక బలంగా ఉన్నా.. నా ప్రథమ కర్తవ్యం మాత్రం ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్ ఆడడం. ఐదు రోజుల సంప్రదాయ ఆటలో ఉండే నైపుణ్యం ఎన్ని టీ20 మ్యాచ్‌లాడిన సొంతం చేసుకోలేం. అందుకే నా దృష్టిలో టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తా. ఇక ఐపీఎల్‌లో అవకాశమిస్తే మాత్రం నా శైలి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలన్న కోరిక బలంగా ఉన్నా.. సమయం కలిసిరాకపోతే.. మన చేతిలో ఏం ఉండదనేది బలంగా నమ్ముతా ..అదే నా ఫిలాసఫీ.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ మలాన్ ఇంగ్లండ్ తరపున 24 టీ20 మ్యాచ్‌లాడి 1003 పరుగులు.. 3 వన్డేల్లో 90 పరుగులు.. 15 టెస్టుల్లో 724 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ పంజాబ్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: మ్యాక్స్‌వెల్‌ను తీసుకొని దండగ.. ఆర్‌సీబీకి భారీ మూల్యం
Comments
Please login to add a commentAdd a comment