Photo Courtesy: IPL
ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ సెంచరీతో కదంతొక్కాడు. 52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అరుదైన జాబితాలో చేరిపోయాడు పడిక్కల్. భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా సెంచరీ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు 2009లో మనీష్ పాండే(114 నాటౌట్), పాల్ వాల్తాటి(120 నాటౌట్)లు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వారి సరసన్ పడిక్కల్ చేరాడు. 2009లో మనీష్ పాండు ఈ ఘనత సాధించగా, 2011లో వాల్తాటి ఈ ఫీట్‌ను చేరాడు. సుమారు పదేళ్ల తర్వాత ఒక భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సెంచరీ చేశాడు. కాగా, ఆర్సీబీ విజయానికి 16 పరుగులు దూరంలో ఉన్న సమయంలో పడిక్కల్‌ను సెంచరీ కోసం అడిగినట్లు కెప్టెన్ కోహ్లి తెలిపాడు.
ఆ సమయంలో పడిక్కల్ శతకం చేయడానికి 9 పరుగులే కావాలనే విషయాన్ని ఈ సందర్భంగా కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత పడిక్కల్ సెంచరీ గురించి పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కోహ్లి మాట్లాడుతూ.. ‘సెంచరీ కోసం మేమిద్దరం చర్చించుకున్నాం. నన్ను మ్యాచ్‌ను ఫినిష్ చేయమని చెప్పాడు. నా సెంచరీ గురించి ఆలోచించకుండా మ్యాచ్‌ను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేద్దాం అని పడిక్కల్ అన్నాడు. ఇది నీకు తొలి సెంచరీ అవుతుందని చెప్పా. కానీ ఇటువంటివి చాలా వస్తాయి అని పడిక్కల్ నాతో అన్నాడు. దానికి నేను అంగీకరిస్తూనే ముందు ఈ మైలురాయిని ముందు చేరుకో అని చెప్పా. ఈ సెంచరీ పూర్తి చేసుకుని అప్పుడు చెప్పు అని అన్నాడ. పడిక్కల్‌కు మూడంకెల మార్కును దాటే అర్హత ఉంది’ అని తెలిపాడు.
నిన్నటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసే సరికి బోర్డుపై 181 పరుగులు ఉండటంతో ఆ జట్టు కొత్త రికార్డును లిఖించింది. ఇది ఆర్సీబీకి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. ఆర్సీబీ క్రికెట్ చరిత్రలో అంతకుముందు 2013లో క్రిస్ గేల్-దిల్షాన్‌లు నమోదు చేసిన 167 పరుగుల రికార్డును పడిక్కల్-కోహ్లిల జోడి సవరించింది. 2016లో గేల్-కోహ్లిలు కింగ్స్ పంజాబ్‌పై నమోదు చేసిన 147 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీ తరఫున మూడొ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment