ఢిల్లీ: సీఎస్‌కే జట్టులోని ఆటగాళ్లంతా ఇంటికి సురక్షితంగా చేరుకున్నాకే తాను ఇంటికి వెళతానని ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని తెలపడం చర్చనీయాశంగా మారింది. ఇండియన్స్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఒక సీఎస్‌కే ఆటగాడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే ఢిల్లీ క్యాంప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ సీజన్ రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో ఆయ ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ఇంటిబాట పట్టారు. వీరిలో విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌కేకు చెందిన ఆటగాళ్లంతా ఇప్పటికే క్యాంప్‌ను వీడి సొంత ప్రదేశాలకు చేరుకునే ప్రయత్నంలో ఉండగా.. ధోని మాత్రం హోటల్ రూంలోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియలో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి సీఎస్‌కే ఆటగాడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ధోని హోటల్‌లో ఉండిపోవడానికి గల కారణాన్ని రివీల్ చేసినట్లు సమాచారం.
'' సీఎస్‌కే జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లంతా వారి దేశాలకు వెళ్లిపోయేంతవరకు తాను హోటల్ రూంలో ఉంటాను. వారు సురక్షితంగా ఇంటికి చేరారు అనే వార్త విన్న తర్వాత నేను రాంచీ ఫ్లైట్ ఎక్కుతా. నా జట్టులో ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని నేనే కావాలి. ఇప్పటికే దీనికి సంబంధించి జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి అనుమతి కోరాను.'' అని ధోని తనకు వివరించినట్లు తెలిపాడు. '' ధోని గురువారం సాయంత్రం రాంచీకి వెళ్లే అవకాశం ఉంది. సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటికే మాకోసం 10 చార్టర్ ఫ్లైట్లను ఏర్పాటు చేసి రాజ్‌కోట్, ముంబై, బెంగళూరు, చెన్నైలలో విడిచిపెట్టింది. జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్ల కోసం కూడా సీఎస్‌కే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.'' అని తెలిపాడు.
ధోని తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ''ఇది ధోని అంటే.. తనకంటే పక్కవాళ్ల గురించే ఎక్కువగా ఆలోచించడంలో ధోని ఎప్పుడు ముందుంటాడు.. ''అని కామెంట్లు చేశారు. కాగా సీఎస్‌కే జట్టులోనూ కరోనా కలకలం రేపింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ బాలాజీ కరోనా బారీన పడగా.. తాజాగా బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో హస్సీ 15 రోజులపాటు ఇక్కడే ఐసోలేషన్‌లో ఉండేలా సీఎస్‌కే యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
చదవండి: ఐపీఎల్ ఆపేసి మంచి పని చేశారు
Comments
Please login to add a commentAdd a comment