
ఆండ్రీ రస్సెల్‌తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు.
ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్‌లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్‌తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్