హర్షల్ పటేల్(బీసీసీఐ/ ఐపీఎల్)
చెన్నై: హర్షల్ పటేల్.. పెద్దగా అంచనాలు లేని క్రికెటర్. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీకి ఆడిన తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకుని శభాష్ అనిపించాడు. నిన్న ఆర్సీబీకి ఆడిన మ్యాచ్ హర్షల్ పటేల్‌కు 49వ ఐపీఎల్ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ కంటే ముందు ఏనాడు అతను ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ నామమాత్రపు ఆటగాడే. సుదీర్ఘ కాలంగా దేశవాళీ మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్‌గా రాణిస్తున్న హర్షల్.. ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం ఓ మోస్తరు బౌలర్‌గానే మిగిలిపోతున్నాడు.
గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 3 వికెట్లే తీశాడు. దాంతో అతను ఆర్సీబీకి అవసరమా.. అనే అనుమానాలు వచ్చాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్సీబీ అతన్ని తీసుకుంది. అసలు హర్షల్ పటేల్ తీసుకోవడమే ఒకటైతే, తొలి మ్యాచ్‌లనే అతనికి అవకాశం ఇవ్వడంపై ఆర్సీబీ కూర్పు బాలేదని అభిమానుల నోట వినిపించింది. కానీ వారి అంచనాలను తప్పని నిరూపించాడు హర్షల్. ఏకంగా ఐదు వికెట్లు సాధించి ముంబైపై రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌పై ఏ జట్టులోని ఆటగాడు కూడా 5 వికెట్లు తీయలేదు. కానీ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే హర్షల్ ఈ ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై ఈ రికార్డు నెలకొల్పిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఎలా వచ్చాడు.. ఆర్సీబీ ఎందుకు తీసుకుంది?
ఈ సీజన్ కోసం వేలానికి ముందు బెంగళూరు ‘ట్రేడింగ్ విండో’లో హర్షల్‌ను తీసుకుంది. ఆర్సీబీకి ఒక భారత పేస్ బౌలర్ అవసరం ఉండటంతో హర్షల్‌ను తీసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘నోబాల్’తో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. ఆపై లిన్ సిక్స్, సూర్య ఫోర్ బాదడంతో తొలి ఓవర్లో మొత్తం 15 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 16వ ఓవర్లో తిరిగొచ్చిన అతను సత్తా చాటాడు.
హార్దిక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన హర్షల్... తన తర్వాతి ఓవర్లో కిషన్‌ను కూడా ఇలాగే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌నైతే అతను శాసించాడు. భారీ షాట్లు ఆడే అవకాశం ఉన్న కృనాల్ , పొలార్డ్ లను తొలి రెండు బంతుల్లో అవుట్ చేసిన అనంతరం త్రుటిలో హ్యాట్రిక్‌ను చేజార్చుకున్నాడు. అయితే నాలుగో బంతికి జాన్సెన్ (0)ను కూడా బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఫలితంగా తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అదే సమయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
అరంగేట్రమే ఆర్సీబీతో..
హర్షల్ పటేల్ ఐపీఎల్ అరంగేట్రమే ఆర్సీబీతో మొదలైంది. 2012 సీజన్ ఐపీఎల్‌లో భాగంగా జరిగిన వేలంలో హర్షల్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చిన హర్షల్.. వికెట్ కూడా తీయలేదు. ఇక బ్యాటింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ సీజన్ మొదలుకొని 2017 వరకూ ఆర్సీబీతోనే కొనసాగాడు.
2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు జట్టు అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ కాస్త ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారగా అప్పట్నుంచి గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగాడు. ఈ సీజన్‌లో ట్రేడింగ్ విధానం ద్వారా ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇచ్చి కోహ్లి చేతే ప్రశంసలు అందుకున్నాడు. నిన్న హర్షల్ బౌలింగ్ వేసిన విధానం చూస్తుంటే అతను ఆర్సీబీ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ ఉండటం దాదాపు ఖాయం. ఇదే విషయాన్ని కోహ్లి కూడా స్పష్టం చేశాడు. ఈ సీజన్ మొత్తం హర్షల్‌ను కొనసాగించాలనుకుంటున్నట్లు కోహ్లినే తెలపడం హర్షల్ కీలక బౌలర్‌గా మారడానికి ఒక సువర్ణావకాశం ఇచ్చినట్లే.
Comments
Please login to add a commentAdd a comment