ముంబై: ఈ ఐపీఎల్‌లో వరుసగా రెండో పరాజయం ఎదురుకావడంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరాశచెందాడు. మంచి టార్గెట్‌నే ఢిల్లీ ముందు ఉంచినా వారి అద్భుతమైన బ్యాటింగ్‌తో అది చిన్నదైపోయిందన్నాడు. ఈరోజు (ఏప్రిల్18) తన బర్త్‌డే కావడంతో మ్యాచ్ గెలిచి ఉంటే బాగుండేదని, ఓటమి పాలవడం కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత అవార్డుల కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. వరుసగా రెండో ఓటమి ఎదురవడంతో తప్పులు సరిదిద్దుకుని మిగతా మ్యాచ్‌లకు సన్నద్దం అవుతాం అన్నాడు. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో 10 నుంచి 15 పరుగులు తక్కువగానే చేశామన్నాడు.
‘నేను, మయాంక్ 180 నుంచి 190 పరుగులు వస్తే మంచి స్కోరు అవుతుందనుకున్నాం. కానీ శిఖర్ ధవన్ మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. శిఖర్ అద్వితీయంగా బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీకి కంగ్రాట్స్. మేము వాంఖడేలో ఆడిన ప్రతీసారి బౌలింగ్ సెకండ్ అనేది ఎప్పుడూ సవాల్‌గానే ఉంది. ఈ పిచ్‌పై ఎలా ఆడాలనే దానిపై కసరత్తులు చేస్తునే ఉన్నాం. ఢిల్లీ వంటి ఒక నాణ్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఛేజింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ అనేది ఇంకా కష్టంగా ఉంటుంది. మా బౌలర్లు సాధ్యమైనంత మేర కష్టపడ్డారు. బంతి తడిగా మారడంతో అంపైర్లను బాల్ మార్చమని చాలాసార్లు అడిగా. కానీ నిబంధనలు అనుకూలించని కారణంగా అది సాధ్యం కాలేదు’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఇక ఢిల్లీ ఆటగాడు స్టోయినిస్ మాట్లాడుతూ.. ‘ ఈ మ్యాచ్‌లో గెలుపు మాకు చాలా ముఖ్యం. సీజన్ ఆరంభంలో ఉన్నా ప్రతీ గేమ్ ప్రధానమే. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆరంభంలో చూస్తే 250 వరకు వెళుతుందని అనుకున్నా. కానీ మా బౌలర్లు అద్బుతంగా కట్టడి చేశారు. మా ఫోకస్ ఎల్లప్పూడు మంచి ఆరంభాల్ని ఇవ్వాలనే ఉంటుంది. మంచి భాగస్వామ్యాలు నమోదైతే చివర్లో ఫినిషర్లు మిగతా పని చేయడమే మా వ్యూహం. శిఖర్ అసాదారణ రీతిలో చెలరేగిపోయాడు. గత ఏడాది నుంచి ఇదే ఫామ్‌ను శిఖర్ కొనసాగిస్తున్నాడు. పరుగులు కోసం చాలా ఆకలిగా ఉన్నాడు. శిఖర్ ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment