
Photo Courtesy: IPL/BCCI
ఢిల్లీ: ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి బంతి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదనే వాతావరణమే కనిపిస్తుంది. అదే మళ్లీ రిపీట్ అయ్యింది. సీఎస్‌క నిర్దేశించిన 219 పరుగుల భారీ టార్గెట్‌ను ముంబై ఛేదించి భళా అనిపించింది. మ్యాచ్ తర్వాత ప్రెజంటేషన్ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. ఇది తాను అంతకుముందు ఎన్నడూ చూడని ఒక బెస్ట్ గేమ్‌గా అభివర్ణించాడు.
‘నేను ప్రాతినిథ్యం వహించిన సందర్భాలను చూస్తే ఈ తరహా గేమ్‌ను ఎప్పుడూ చూడలేదు. ఇది బెస్ట్ టీ20 గేమ్‌ల్లో ఒకటి. పొలార్డ్ నుంచి ఒక అసాధారణ ఇన్నింగ్స్‌ను డగౌట్ నుంచి చూశాను. మేము ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి బరిలోకి దిగేటప్పుడు ఒకటే అనుకున్నాం. సానుకూల ధోరణిలో ఆడాలి.. అదే సమయంలో 20 ఓవర్లు ఆడాలనే అనుకున్నాం. అలానే మాకు మంచి ఆరంభం వచ్చింది. ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ ఇది. మా జట్టులో భారీ షాట్లు ఆడేవారు ఉన్నారు.
ఈ క్రమంలోనే మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాం. కృనాల్ పాండ్యా-పొలార్డ్‌లు నమోదు చేసిన భాగస్వామ్యమే మా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇటువంటి భారీ స్కోరు మ్యాచ్‌ల్లో ఛేజ్ చేసేటప్పడు పవర్ హిట్టర్లే సాధ్యమైనన్ని ఎక్కువ బంతులు ఆడాలి. అదే మేము చేశాం. మా బ్యాటింగ్ స్టైల్‌కు ఢిల్లీ పిచ్ బాగా సెట్ అవుతుంది’ అని తెలిపాడు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పొలార్డ్ (87 నాటౌట్, 34 బంతులు; 6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment