
Photo Courtesy: IPL
ముంబై: గతేడాది జరిగిన ఐపీఎల్ ద్వారా ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన ఆర్సీబీ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్.. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు ఘన విజయంలో సహకరించాడు. దాంతో పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.. పడిక్కల్‌ను ఆకాశానికెత్తేశాడు. భవిష్యత్తులో ఆ యువ క్రికెటర్ టీమిండియాకు ఆడటం ఖాయమని జోస్యం చెప్పాడు.
తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్న పడిక్కల్‌కు భారత జట్టులో చోటిస్తే ఆశ్చర్యపోవాల్సిందేమీ ఉండదన్నాడు. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాట్లాడిన గావస్కర్.. పడిక్కల్ దేశవాళీ జర్నీ అద్భుతమని కొనియాడాడు. అతను ఏ దేశవాళీ టోర్నీ ఆడినా పరుగుల దాహంతో తపించిపోతాడన్నాడు. ‘ టీమిండియా తరఫున పడిక్కల్ ఆడినా నాకేమీ ఆశ్చర్యం అనిపించదు. అతను క్లాస్ ఆటగాడు, అదే సమయంలో సామర్థ్యం కూడా ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భారీ స్కోర్లు చేశాడు. ఎక్కడ చూసినా పరుగులే. రంజీ ట్రోఫీలో భారీ సెంచరీలు సాధించాడు. 50 ఓవర్ల క్రికెట్‌లోనూ అంతే. టీ20 క్రికెట్‌లో కూడా పరుగుల వరద పారించాడు.
అటువంటి క్రికెటర్‌ను భారత జట్టులోకి ఎందుకు తీసుకోరు. పడిక్కల్ కచ్చితంగా భారత్ తరఫున ఆడతాడు. అది త్వరలో కావొచ్చు.. కాస్త ఆలస్యం కావొచ్చు’అని గావస్కర్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ 7 మ్యాచ్‌ల్లో 700కు పైగా పరుగులు చేశాడు. అందులో నాలుగు వరుస సెంచరీలు ఉన్నాయి. ఇక గత ఐపీఎల సీజన్‌లో పడిక్కల్ 493 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకూ లిస్ట్-ఎ క్రికెట్‌లో 20 మ్యాచ్‌లు ఆడి 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 కెరీర్‌లో రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 10 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక్కడ అతని అత్యధిక స్కోరు 99.
ఇక్కడ చదవండి: ఢిల్లీతో అక్షర్ పటేల్.. ఆ నవ్వే ఓ కథ అంటోన్న ఫ్రాంచైజీ
16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను!
ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..!
Comments
Please login to add a commentAdd a comment