KL Rahul(Photo: IPL)
Ajay Jadeja Comments On KL Rahul: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సర్దుకుపోయే మనస్తత్వం ఉందని, నాయకుడి లక్షణాలు మాత్రం లేవని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. పంజాబ్ సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. అయితే, టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగగలడని వ్యాఖ్యానించాడు. కాగా గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్... బ్యాటర్‌గా రాణిస్తున్నా.. కెప్టెన్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
అతడి సారథ్యంలో ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. పద్నాలుగింటిలో గెలిచింది. ఇక గత సీజన్‌లో లీగ్ దశలోనే వెనుదిరిగిన రాహుల్ సేన.. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమితో దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో అజయ్ జడేజా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత రెండేళ్లుగా అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ.. ఒక్కసారి కూడా అతడిలో నాకు నాయకుడి లక్షణాలు కనిపించలేదు. జట్టు ఓడినా, గెలిచినా.. మన దృష్టి రాహుల్‌పై ఉండదు.
అసలు తుదిజట్టులో ఎవరు ఆడుతున్నారు? మార్పులు, చేర్పులు ఏం ఉన్నాయి. అసలు ఈ విషయాల గురించి రాహుల్‌కు అవగాహన ఉందా అని అనిపిస్తుంది. టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేసే వ్యక్తిలో లీడర్ లక్షణాలు ఉన్నాయా అని చూస్తారు. కానీ, కేఎల్ రాహుల్‌లో ఇలాంటివేమీ నాకు కనిపించడం లేదు. తను చాలా నెమ్మదస్తుడు. ప్రతీ విషయానికి సర్దుకుపోతాడు. ఒకవేళ అతడు గనుక భారత జట్టు కెప్టెన్ అయితే... సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగగలడు. ఎందుకంటే.. ప్రతీ విషయానికి సర్దుకుపోతూ... తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఐపీఎల్ జట్టుకు, టీమిండియాకు సారథ్యం వహించడంలో చాలా తేడా ఉంటుందని, కాస్త దూకుడుగా ఉంటూనే కెప్టెన్‌గా విజయవంతమవుతారని చెప్పుకొచ్చాడు. ఇక ధోని వలె కేఎల్ రాహుల్ సైతం సైలెంట్‌గా ఉంటాడని, కానీ నాయకుడంటే గెలుపోటముల బాధ్యతలు మోయగల శక్తి కలిగి ఉండాలని చెప్పుకొచ్చాడు. కాగా ఈనెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లి.. పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైఎస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ వస్తుందనే వార్తలు వినిపిస్తుండగా... పలువురు మాజీలు కేఎల్ రాహుల్ పేరును సూచిస్తున్నారు. ఈ క్రమంలో అజయ్ జడేజా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఆడిన 12 మ్యాచ్‌లలో అతడు 528 పరుగులు(అత్యధిక స్కోరు- 91 నాటౌట్) చేసి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.
చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు!
Comments
Please login to add a commentAdd a comment