Photo: IPL/BCCI
Lisa Sthalekar Comments on David Warner: డేవిడ్ వార్నర్ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వ్యవహరిస్తున్న తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్ తప్పుబట్టింది. జట్టుకు అతడు అందించిన సేవలను అసమానవైనవని, అలాంటి వార్నర్ విషయంలో అవనమానకరంగా ప్రవర్తించడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు క్రిక్‌బజ్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘డేవిడ్ వార్నర్ విషయంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్రవర్తించిన తీరు చూసి గుండె పగిలింది. ఫ్రాంఛైజీ కోసం అతడు చాలా చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు. 2016లో టైటిల్ సాధించిపెట్టాడు.
అలాంటి కెప్టెన్ పట్ల ఈవిధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. తను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. నిజంగా ఫ్రాంఛైజీ తీరు అస్సలు నచ్చడం లేదు. నాకు తెలిసి.. వచ్చే ఏడాది వాళ్లు తనను రీటైన్ చేసుకోరేమో! కాబట్టి తనను చివరి మ్యాచ్ ఆడనిస్తే బాగుంటుంది. హైదరాబాద్ అభిమానులు తన ఆట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొంది.
కాగా ఐపీఎల్-2021 సీజన్ తొలి అంచెలో ఆరెంజ్ ఆర్మీ వరుస వైఫల్యాల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో ఈ ఆసీస్ బ్యాటర్ విఫలం కావడంతో... పూర్తిగా పక్కన పెట్టేసింది. కొన్ని మ్యాచ్‌లలో కనీసం మైదానంలో కూడా అతడు కనిపించలేదు.
అయితే, ఇటీవలి కేకేఆర్ మ్యాచ్‌లో డగౌట్‌లో వార్నర్ కనిపించడంతో అభిమానులు కాస్త సంతోషించారు. ఇక హైదరాబాద్ తరఫున తనకు ఇదే చివరి సీజన్ కాబోతుందంటూ వార్నర్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో... లీసా వలె ఫ్యాన్స్ సైతం అతడిని చివరి మ్యాచ్ ఆడనివ్వాలని కోరుతున్నారు. ఇక బుధవారం హైదరాబాద్ జట్టు, ఆర్సీబీతో తలపడనున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు వార్నర్ మైదానంలోనైనా కనిపిస్తాడో లేదో చూడాలి!.. ఇక ఇప్పటికే విలియమ్సన్ సేన ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
చదవండి: T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా!
Comments
Please login to add a commentAdd a comment