Photo Courtesy: Mumbai Indians Twitter
Rohit Sharma Comments On KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ అంత సులువేమీ కాదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో గెలుపుతో ఊపు మీదున్న కేకేఆర్‌ను కట్టడి చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య గురువారం మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజా సీజన్ రెండో దశ చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై మధ్య మ్యాచ్‌తో సెప్టెంబరు 19న పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లేకుండానే బరిలో దిగిన ముంబై పరాజయం పాలైంది. బౌలర్లు అందించిన చక్కటి శుభారంభాన్ని వినియోగించుకోలేక కెప్టెన్ కీరన్ పొలార్డ్ పెద్ద తప్పిదమే చేశాడని చెప్పవచ్చు. ఫలితంగా ఓటమితో ముంబై ప్రయాణం మొదలైంది. మరోవైపు.. పటిష్ట స్థితిలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి అద్భుతమైన జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందిన కేకేఆర్ జోరు మీద ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో మోర్గాన్ సేన రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో దిగేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్ మెరుగైన స్థితిలో ఉంది. గత మ్యాచ్‌లో సమిష్టిగా రాణించింది. విజయం సాధించింది. సహజంగానే పూర్తి ఆత్మవిశ్వాసంతో రంగంలోకి దిగుతుంది. కాబట్టి.. నేటి మ్యాచ్ మాకు అంత ఈజీ ఏం కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. గత రికార్డులపై తనకు నమ్మకం లేదని, టీ20 మ్యాచ్‌లో సదరు రోజు ప్రదర్శన ఎలా ఉందన్న అంశం మీదనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
‘‘మ్యాచ్ జరిగే రోజు అత్తుత్యమ ప్రదర్శన కనబరిస్తే చాలు. తప్పకుండా విజయం వరిస్తుందని నమ్ముతాను. కేకేఆర్ మీద మా రికార్డు బాగుందనేది వాస్తవం. కాబట్టి.. ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది. అంతే తప్ప గత రికార్డులతో పెద్ద సంబంధం ఉండదని భావిస్తాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ముంబై- కోల్‌కతా జట్లు 28 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 22 సార్లు ముంబై గెలవగా.. కేవలం ఆరు సార్లే కోల్‌కతా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment