ముంబై: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ కొనసాగుతున్న వేళ ఐపీఎల్ 2021 నిర్వహణ కష్టంగా మారింది. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్ విధించడంతో, వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరుగుతాయా లేదా అని సందేహాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అభిమానుల ఉత్కంఠకు బీసీసీఐ తెర దించింది. వాంఖడేలో మ్యాచ్‌లపై స్పష్టతనిస్తూ ఐపీఎల్ మ్యాచులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఇందులో ఎటువంటి మార్పు లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కార్యదర్శి సంజయ్ నాయక్ మీడియాకు తెలిపారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం
‘ఆటగాళ్లు మాత్రమే కాదు, సహాయ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్కరినీ బయో సేఫ్టీ బబుల్ లో ఉంచుతున్నాము. ముంబైలో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ మ్యాచ్ రోజులలో స్టేడియానికి ప్రయాణించడం సమస్య కాదు. ఆటగాళ్లతో పాటు వారి సహాయ సిబ్బందికి కూడా క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయి. గత సంవత్సరం దుబాయిలో తీసుకున్నజాగ్రత్తలు లానే అన్నింటినీ పాటించేలా బోర్డు చర్యలు తీసుకుంది. కనుక ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా జరుపగలమని బీసీసీఐ భావిస్తోంది’ అని సంజయ్ నాయక్ పేర్కొన్నారు.
ఇక ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. కాగా, వాంఖడే స్టేడియం తాజా ఐపీఎల్ సీజన్‌లో ఏప్రిల్ 10-25 వరకు 10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ ఏప్రిల్ 10 న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
( చదవండి: ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్‌కే )
Comments
Please login to add a commentAdd a comment