SRH: ఆరంభంలో దంచికొడతారు.. కానీ అంతలోనే! | IPL 2021 PBKS Vs SRH Can Hyderabad Record 1st Win Today Match | Sakshi
Sakshi News home page

PBKS Vs SRH: సన్‌రైజర్స్‌.. అసలు ఎందుకిలా జరుగుతోంది?

Published Wed, Apr 21 2021 9:10 AM | Last Updated on Wed, Apr 21 2021 2:08 PM

IPL 2021 PBKS Vs SRH Can Hyderabad Record 1st Win Today Match - Sakshi

చెన్నై: ఆరంభంలో దంచికొట్టడం... లక్ష్యం వైపు సాఫీగా సాగుతున్నట్లు కనిపించడం... అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలి ఓటమిని ఆహ్వానించడం... ఇదీ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ తీరు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే బలహీనతతో ఓడిన హైదరాబాద్‌... పరాభవాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసి పాయింట్ల ఖాతా తెరవకుండా పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇక్కడి చెపాక్‌ స్టేడియంలో బుధవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో హైదరాబాద్‌ ఆడనుంది. మరోవైపు గెలుపుతో సీజన్‌ను ఘనంగా ఆరంభించిన పంజాబ్‌... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి కాస్త డీలా పడింది. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని పంజాబ్‌... ఇప్పటికే ఆలస్యమైన సీజన్‌ తొలి గెలుపును ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని వార్నర్‌ బృందం పట్టుదలగా ఉన్నాయి. 

కూర్పుపై తర్జనభర్జన... 
మూడు మ్యాచ్‌ల అనంతరం కూడా తుది జట్టులో ఎవరు ఉండాలి... ఎవరు ఉండకూడదు అనే అంశంపై హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌కు సరైన అవగాహన లేదనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో రైజర్స్‌ ఏకంగా నాలుగు మార్పులు చేయగా... అందులో ఖలీల్‌ అహ్మద్, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు మాత్రమే ఆకట్టుకోగలిగారు. విరాట్‌ సింగ్, అభిషేక్‌ వర్మలు పూర్తిగా విఫలమయ్యారు. దాంతో హైదరాబాద్‌ మరోసారి మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కేన్‌ విలియమ్సన్‌ ఫిట్‌గా ఉంటే అతడు ముజీబ్‌ స్థానంలో బరిలోకి దిగతాడు. అలా జరగకపోతే హోల్డర్‌ లేదా జేసన్‌ రాయ్‌లలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. యువ క్రికెటర్‌ ప్రియమ్‌ గార్గ్‌ కూడా ఈసారి తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు.

ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టోలు రాణిస్తున్నా... మిడిల్‌ ఆర్డర్‌ బలహీనంగా ఉంది. ముఖ్యంగా మనీశ్‌ పాండే ఒత్తిడిని అధిగమించి జట్టుకు అవసరమైన కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడికి భువనేశ్వర్, ఖలీల్‌ అహ్మద్‌ కూడా సహకరిస్తే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు. ఇక పంజాబ్‌ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. జట్టులో అదనపు స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే మాత్రం... మెరిడిత్‌ స్థానంలో వెస్టిండీస్‌ ప్లేయర్‌ ఫాబియాన్‌ అలెన్‌ను పంజాబ్‌ తీసుకునే అవకాశం ఉంది. ముఖాముఖి పోరులో మాత్రం హైదరాబాద్‌ ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు జరిగాయి. అందులో హైదరాబాద్‌ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... పంజాబ్‌ ఐదింటిలో గెలిచింది.  

చదవండి: రాజస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ: అప్పుడు స్టోక్స్‌.. ఇప్పుడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement