PBKS Vs SRH: ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం | IPL 2021 Punjab Kings Vs Sunrisers Hyderabad Match Live Updates Highlights | Sakshi
Sakshi News home page

PBKS Vs SRH IPL 2021 2nd Phase: ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం

Published Sat, Sep 25 2021 7:10 PM | Last Updated on Sat, Sep 25 2021 11:15 PM

IPL 2021 Punjab Kings Vs Sunrisers Hyderabad Match Live Updates Highlights - Sakshi

Photo Courtesy: IPL

ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం
126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన  ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ విజయం పంజాబ్‌నే వరించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో రెండో బంతికే సిక్సర్‌ బాదిన హోల్డర్‌(29 బంతుల్లో 47; 5 సిక్సర్లు) పంజాబ్‌ శిబిరంలో టెన్షన్‌ పుట్టించాడు. అయితే ఆఖరి ఓవర్‌ బౌల్‌ చేసిన నాథన్‌ ఇల్లీస్‌ అద్భుతంగా బౌల్‌ చేసి హోల్డర్‌ను కట్టడి చేయడంతో పంజాబ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన(3/19, 47 నాటౌట్‌) చేసిన హోల్డర్‌ శ్రమ వృధా అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్‌ అదే 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రషీద్‌ ఖాన్‌(3) ఔట్‌
12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన తరుణంలో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రషీద్‌ ఖాన్‌(4 బంతుల్లో 3) అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ 105 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్లో హోల్డర్‌(37), భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. సాహా(31) రనౌట్‌
24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో సన్‌రైజర్స్‌ జట్టు ఒత్తిడికి లోనైంది. అనవసర పరుగుకు ప్రయత్నించి సాహా(37 బంతుల్లో 31; ఫోర్‌) రనౌటయ్యాడు. 16.1 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 91/6. క్రీజ్లో హోల్డర్‌(14 బంతుల్లో 27; 3 సిక్సర్లు), రషీద్‌ ఖాన్‌ ఉన్నారు.

రవి బిష్ణోయి మాయాజాలం.. 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
రవి బిష్ణోయి స్పిన్‌ మాయాజాలానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తడబడుతుంది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్ రెండో బంతికి కేదార్‌ జాదవ్‌(12 బంతుల్లో 12)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన బిష్ణోయి.. అదే ఓవర్‌ ఆఖరి బంతికి అబ్దుల్‌ సమద్‌(2 బంతుల్లో 1)ను బోల్తా కొట్టించాడు. సమద్‌.. షార్ట్‌ థర్డమెన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ 60 పరుగులకే సగం  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్లో సాహా(26), హోల్డర్‌ ఉన్నారు.

32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌.. మనీశ్‌ పాండే(13) ఔట్‌
32 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో మనీశ్‌ పాండే(23 బంతుల్లో 13; ఫోర్‌) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 32/3. క్రీజ్‌లో సాహా(13), కేదార్‌ జాదవ్‌ ఉన్నారు. 

షమీ ఆన్‌ ఫైర్‌.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు
ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో వార్నర్‌ వికెట్‌ పడగొట్టిన షమీ.. 3వ ఓవర్‌ రెండో బంతికే విలియమ్సన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 2.2 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 10/2. క్రీజ్‌లో సాహా(7), మనీశ్‌ పాండే ఉన్నారు.

మరోసారి నిరాశపర్చిన వార్నర్‌(2).. సన్‌రైజర్స్‌ తొలి వికెట్‌ డౌన్‌ 
ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(3 బంతుల్లో 2) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. రెండో దశ తొలి మ్యాచ్లో డకౌట్‌గా వెనుదిరిగిన ఆయన.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 2 పరుగులకే ఔటయ్యాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ మూడో బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. షమీ విసిరిన వైడ్‌ బాల్‌ను కట్‌ షాట్‌ ఆడబోయిన వార్నర్‌.. వికెట్‌కీపర్‌ రాహుల్‌ చేతికి చిక్కాడు. దీంతో 2 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. క్రీజ్లో సాహా, విలియమ్సన్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

పంజాబ్‌ నామమాత్రపు స్కోర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 126
సన్‌రైజర్స్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పంజాబ్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌(32 బంతుల్లో 27;  2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌(3/18) రాహుల్‌ సేనను దారుణంగా దెబ్బకొట్టగా, సందీప్‌ శర్మ, భువీ, రషీద్‌ ఖాన్‌, అబ్దుల్‌ సమద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

పంజాబ్‌ ఏడో వికెట్‌ డౌన్‌.. నాథన్‌ ఇల్లీస్‌(12) ఔట్‌
19.2 ఓవర్లో భువనేశ్వర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన నాథన్‌ ఇల్లీస్‌(12 బంతుల్లో 12; సిక్స్‌) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. ఫలితంగా 118 పరుగుల వద్ద పంజాబ్‌ 7వ వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో హర్ప్రీత్‌ బ్రార్‌(12), మహ్మద్‌ షమీ ఉన్నారు.

సుచిత్‌ సూపర్‌ క్యాచ్‌.. పంజాబ్‌ ఆరో వికెట్‌ డౌన్‌
జేసన్‌ హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15.4 ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సుచిత్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో దీపక్‌ హూడా(13 బంతుల్లో 10;  ఫోర్‌) వెనుదిరిగాడు. దీంతో 96 పరుగులకే పంజాబ్‌ 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో హర్ప్రీత్‌ బ్రార్‌(4), నాథన్‌ ఇల్లీస్‌ ఉన్నారు. 

88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. మార్క్రమ్‌(27) ఔట్‌
అబ్దుల్‌ సమద్‌ విసిరిన ఫుల్‌ టాస్‌ బంతిని భారీ షాట్‌ ఆడే క్రమంలో లాంగ్‌ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్‌ మనీశ్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి మార్క్రమ్‌(32 బంతుల్లో 27;  2 ఫోర్లు) ఔటయ్యాడు. 14.4 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 88/5.  క్రీజ్లో దీపక్‌ హూడా(13), హర్ప్రీత్‌ బ్రార్‌ ఉన్నారు.

సందీప్‌ శర్మ సూపర్‌ రిటర్న్‌ క్యాచ్‌.. పూరన్‌(8) ఔట్‌
సందీప్‌ శర్మ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన పూరన్‌(4 బంతుల్లో 8; సిక్స్‌).. ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. సందీప్‌ శర్మ అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌ అందుకోవడంతో పూరన్‌ వెనుదిరగక తప్పలేదు. 11.4 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 66/4. క్రీజ్లో మార్క్రమ్‌(16), దీపక్‌ హూడా ఉన్నారు.

డేంజర్‌ మ్యాన్‌ గేల్‌(14) ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
ఒక్క పరుగు వ్యవధిలో ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన పంజాబ్‌కు 11వ ఓవర్లో మరో షాక్‌ తగిలింది. స్టార్‌ ఆటగాడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌(17 బంతుల్లో 14; ఫోర్‌)ను రషీద్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. 11. 4 బంతికి రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గేల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 57 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్లో మార్క్రమ్‌(15), పూరన్‌ ఉన్నారు.


Photo Courtesy: IPL

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన హోల్డర్‌.. ఓపెనర్లిద్దరు ఔట్‌
ఐపీఎల్‌-2021 రెండో దశలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌ చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపిన ఆయన.. అదే ఓవర్‌ ఐదో బంతికి మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(6 బంతుల్లో 5)ను కూడా ఔట్‌ చేశాడు. దీంతో పంజాబ్‌ జట్టు 4. 5 ఓవర్లకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయి 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. హోల్డర్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ క్యాచ్‌ పట్టడంతో మయాంక్‌ వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్లో గేల్‌(1), మార్క్రమ్ ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. కేఎల్‌ రాహుల్‌(21) ఔట్‌
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బరిలోకి దిగిన పంజాబ్‌కు 5వ ఓవర్‌ తొలి బంతికే షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(21 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను జేసన్‌ హోల్డర్‌ పెవిలియన్‌కు పంపాడు. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్‌.. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సుచిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 4.1 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 26/1. క్రీజ్‌లో మయాంక్‌(5), గేల్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

షార్జా: ఐపీఎల్-2021 రెండో దశ తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు  17 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో, పంజాబ్ కింగ్స్‌ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. 

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌ గేల్‌, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, రవి బిష్ణోయి, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, నాథన్‌ ఇల్లీస్‌.
చదవండి: ర‌ద్దైన టెస్ట్‌ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement