గత ఐదు సీజన్లలో ఒకసారి చాంపియన్, ఒకసారి రన్నరప్, మరో మూడుసార్లు కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన కనబర్చిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. స్టార్ ఆటగాళ్లతో భారీ హంగామాలాంటివి కనిపించకపోయినా ప్రతీ సీజన్‌లో ఆటపరంగా అందరి దృష్టినీ ఆకర్షించే టీమ్ ఇది. ముఖ్యంగా వార్నర్ బ్యాటింగ్ మెరుపులు... ఒంటిచేత్తో మ్యాచ్ దిశను మార్చే భువనేశ్వర్, రషీద్‌ల బౌలింగ్ ప్రదర్శనలు సగటు ‘సన్’ అభిమానికి గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎనిమిదేళ్ల లీగ్ ప్రస్థానంలో ఒకసారి చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ రెండో టైటిల్ వేటలో పట్టుదలగా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. గత సీజన్‌లో మూడో స్థానం తర్వాత ఈసారి మరో మెట్టు ఎక్కేందుకు రైజర్స్ సిద్ధమైంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులతో సత్తా చాటి వార్నర్ సేన మళ్లీ విజయ ఢంకా మోగిస్తుందో లేదో వేచి చూడాలి!
కొత్తగా వచ్చినవారు...
ఐపీఎల్ వేలంలో ఏమాత్రం చురుకుదనం చూపించని టీమ్ సన్‌రైజర్స్. కేవలం ముగ్గురిని మాత్రమే వేలంలో కొనుగోలు చేసింది. ఇప్పటికే కుదురుకున్న ‘కోర్ గ్రూప్’ ఉండటంతో కొత్త ఆటగాళ్లపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు. భారత్‌కే చెందిన నాణ్యమైన పేస్ బౌలర్లు ఉండటంతో వేలానికి ముందు ఒక విదేశీ పేస్ బౌలర్, భారత దేశవాళీ ఆల్‌రౌండర్ అవసరం జట్టుకు కనిపించింది. అందుకే వేలంలో శివమ్ దూబే, కృష్ణప్ప గౌతమ్‌లను తీసుకునేందుకు పోటీ పడింది. అయితే చివరకు వీరిద్దరు దక్కలేదు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.5 కోట్లు), జగదీశ సుచిత్ (రూ. 30 లక్షలు)లు మాత్రమే జట్టులోకి వచ్చారు. సరైన ఆల్‌రౌండర్ మాత్రం లభించలేదు. చివరకు రూ.6.95 కోట్లు జట్టు ఖాతాలో మిగిలాయి. టీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా అవకాశం దక్కకపోవడం గమనార్హం.
తుది జట్టు అంచనా/ఫామ్
తుది ఫలితంతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ జట్టుకు మూలస్థంభంలా నిలిచిన విదేశీ ఆటగాళ్లు వార్నర్, రషీద్. గత రెండు సీజన్లుగా వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా చెలరేగుతున్న బెయిర్‌స్టోకు కూడా చోటు ఖాయం. నాలుగో ఆటగాడిగా జట్టుకు కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మూడో స్థానంలో ఆడిన విలియమ్సన్ మొదటి ప్రాధాన్యత కావచ్చు కానీ... ఆల్‌రౌండర్ కావాలనుకుంటే గత లీగ్‌లో ‘సన్’ రాత మార్చిన జేసన్ హోల్డర్ జట్టులోకి వస్తాడు. వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే జేసన్ రాయ్‌కు కొన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. గత సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన నబీకి కూడా కష్టమే కాగా... ముజీబ్‌కు కూడా చోటు అంత సులువు కాదు. సాహాను మరోసారి ఓపెనర్‌గా ప్రయత్నించే అవకాశం ఉంది. జట్టులో ఆరుగురు రెగ్యులర్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో సమస్య లేదు. పైగా భువీ, నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్‌లో చక్కటి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. మిడిలార్డర్ వైఫల్యమే గత కొన్ని సీజన్లుగా రైజర్స్‌ను ఇబ్బంది పెడుతోంది. 2020 సీజన్‌లో కూడా అదే సమస్య కనిపించింది. గార్గ్ ప్రభావం చూపలేకపోగా, పాండే, విజయ్‌శంకర్‌లలో దూకుడు కనిపించలేదు. ఈ విషయంలో జాదవ్‌ను జట్టు నమ్ముకుంది. ఓవరాల్‌గా టాపార్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్‌పైనే మరోసారి హైదరాబాద్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: సాహా, ఖలీల్ అహ్మద్, అబ్దుల్ సమద్, సందీప్ శర్మ, శ్రీవత్స్ గోస్వామి, కేదార్ జాదవ్, అభిషేక్ శర్మ, బాసిల్ థంపి, భువనేశ్వర్, సుచిత్, విరాట్ సింగ్, నటరాజన్, షాబాజ్ నదీమ్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్, ప్రియమ్ గార్గ్.
విదేశీ ఆటగాళ్లు: వార్నర్ (కెప్టెన్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నబీ, జేసన్ రాయ్, హోల్డర్, విలియమ్సన్, బెయిర్‌స్టో.
సహాయక సిబ్బంది: టామ్ మూడీ (డైరెక్టర్ ఆఫ్ క్రికెట్), బేలిస్ (హెడ్ కోచ్), బ్రాడ్ హాడిన్ (అసిస్టెంట్ కోచ్), బిజూ జార్జ్ (ఫీల్డింగ్ కోచ్), వీవీఎస్ లక్ష్మణ్ (బ్యాటింగ్ మెంటార్), మురళీధరన్ (బౌలింగ్ మెంటార్).
లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన
►2016లో చాంపియన్
2020లో ప్రదర్శన: మరో రెండు జట్లతో పాటు సమానంగా 7 మ్యాచ్‌లే గెలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా పట్టికలో మూడో స్థానంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో నెగ్గి రెండో క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు, టోర్నీని మూడో స్థానంతో ముగించింది. తొలి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు ఓడిన రైజర్స్... హోల్డర్, నటరాజన్, సందీప్ శర్మ, వృద్ధిమాన్ సాహా చలవతో తర్వాతి 5 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించింది. మరోసారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్ గా (548) నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment