న్యూఢిల్లీ: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విటర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడని సంచలన కామెంట్స్ చేసింది. దీంతో తస్లీమాపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రికెటర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతోంది.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ముస్లిం అయినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, తన చర్యల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదు కదా? అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తస్లీమా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
కాగా, త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్తగా జెర్సీని రూపొందించింది. అయితే ఆ జర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున దాని బదులు మరో జర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్ అలీ జట్టు యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యమే మొయిన్ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైంది. కాగా, లోగో అంశంలో మొయిన్ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
చదవండి: ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు 5 వికెట్లు సాధించడమే లక్ష్యం: షకీబ్
Comments
Please login to add a commentAdd a comment