Photo Courtesy: BCCI/IPL
చెన్నై: గతేడాది ఐపీఎల్ సీజన్‌ను ఒక సిక్స్ లేకుండా ముగించిన మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ వదిలేయగా.. ఈసారి వేలంలో రూ. 14 కోట్లకు పైగా చెల్లించి ఆర్సీబీ కొనుగోలు చేసింది. మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ తీసుకోవడానికి కెప్టెన్ కోహ్లినే కారణం. ఆ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు మ్యాక్సీ. ఒక హార్డ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉండాలని భావించిన కోహ్లి ముందు నుంచి మ్యాక్స్‌వెల్‌పై కన్నేశాడు. ఈ విషయాన్ని ముందుగానే మ్యాక్సీకి తెలిపిన కోహ్లి.. అనుకున్నట్లే అతన్ని తీసుకున్నాడు.
ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం పోటీ జరిగినా ఆర్సీబీ చివర వరకూ వెళ్లి అతన్ని దక్కించుకుంది. అందుకు తగ్గట్టుగానే నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 41 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ మ్యాక్సీ ఐదు సిక్సర్లు కొట్టడం, ఆ రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌గానే కనిపిస్తోంది.
కాగా, మ్యాక్స్‌వెల్‌కు కోహ్లి ఒక గొప్ప ఆస్తి అని అంటున్నాడు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ. బుధవారం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెట్ లీ.. ‘ మ్యాక్స్‌వెల్ కొత్త కలర్స్‌లో ఆడుతున్నాడు. అది మ్యాక్స్‌వెల్‌కు ఈ సీజన్‌లో ఉపయోగపడింది. ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్‌లను బట్టి చూస్తే కోహ్లితో కలిసి సానుకూల ధోరణిలో బ్యాటింగ్ చేశాడు. మ్యాక్సీకి కోహ్లి దొరకడం నిజంగా అదృష్టం. అతనికి కోహ్లి గొప్ప ఆస్తి. మ్యాక్స్‌వెల్ తిరిగి తన ఆటపై దృష్టిసారించడానికి కోహ్లినే కారణం.
కోహ్లికి మ్యాక్సీతో సాన్నిహిత్యం బాగుంది. దాంతోనే మ్యాక్స్‌వెల్ తన సహజసిద్ధమైన తరహాలో ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడు’ అని కొనియాడాడు. ఇక మ్యాక్సీ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. ‘ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్ చాలా ముఖ్యమైన ఆటగాడు. ఇప్పటివరకూ మ్యాక్సీ ప్రదర్శన బాగుంది. అతనిపై నమ్మకంతో అత్యధిక ధర చెల్లించి ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మ్యాక్స్‌వెల్ ఆట సాగుతోంది’ అని గంభీర్ తెలిపాడు.
ఇక్కడ చదవండి: పాండే 14 సార్లు.. ఎస్‌ఆర్‌హెచ్ 11 సార్లు
మ్యాక్స్‌వెల్ 1,806 రోజుల తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment