IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడా అన్న అంశంపై సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో క్రీడా విశ్లేషకులు, టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయంపై తమ అంచనాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఇతడేనంటూ ఓ వీడియో వదిలాడు.
మార్కీ ప్లేయర్ల(స్టార్ ఆటగాళ్లు) లిస్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం జట్లు పోటీ పడటం ఖాయమని, ఈ వేలంలో అతడే అధిక ధర పలుకుతాడని జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్ కీలక ఆటగాళ్ల జాబితాలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, షమీ, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘ఇషాన్ కిషన్ మార్కీ ప్లేయర్ల లిస్టులో లేడు. ఒకవేళ అతడు ఈ జాబితాలో ఉంటే గనుక గట్టి పోటీ ఉండేది. కాబట్టి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్‌కే ఆ అవకాశం ఉంది. అతడే అత్యధిక ధరకు అమ్ముడుపోతాడు.
ఇషాన్ కిషన్ కోసం కొంత అమౌంట్‌ను ఫిక్స్ చేసుకున్న ఫ్రాంఛైజీలు.. అయ్యర్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేసే ఛాన్స్ ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా... ‘‘పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ వైపు చూడకపోవచ్చు. అతడు... కేకేఆర్ లేదంటే ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్-2021 తొలి దశలో గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిషభ్ పంత్‌కు యాజమాన్యం కెప్టెన్సీ అప్పజెప్పగా ... అతడు మంచి ఫలితాలు అందించాడు.
ఈ క్రమంలో రెండో అంచెకు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా.. పంత్‌నే సారథిగా కొనసాగించింది. అంతేకాదు మెగా వేలం నేపథ్యంలో అయ్యర్‌ను వదిలేసింది కూడా. ఈ నేపథ్యంలో ఆక్షన్‌లోకి రానున్న ఈ యువ ఆటగాడు రికార్డు ధరకు అమ్ముడుపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా... కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్ శ్రేయస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుందని వార్తలు వినిపించాయి. అయితే, అహ్మదాబాద్ మాత్రం హార్దిక్ పాండ్యాను తమ సారథిగా ఎంచుకుంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12 ,13 తేదీల్లో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment