PC: IPL
‘‘అవును... రెండు విషయాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. 12 నెలల పాటు బయోబబుల్‌లో ఉండటం.. ఐసోలేషన్, క్వారంటైన్‌లో గడపటం... కాబట్టి రానున్న 12 నెలల పాటు షెడ్యూల్‌ను నాకు అనుగుణంగా మలచుకోవాలనుకుంటున్నాను. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కుటుంబంతో కలిసి సమయం గడపాలనుకుంటున్నాను’’ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైలీ జెమీసన్ అన్నాడు.
కాగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన జెమీసన్... ఐపీఎల్-2022 మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. గతేడాది మినీ వేలంలో భాగంగా రూ. 15 కోట్లు పలికిన అతడు ఈ మేరకు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన కైలీ జెమీసన్... మెగా వేలానికి దూరంగా ఉండటానికి గల కారణాలు వెల్లడించాడు.
బయోబబుల్ నిబంధనలు ఒక రీజన్ అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించడం కోసం మరింత కసరత్తు చేయాల్సి ఉందని, ఆ దిశగా దృష్టి సారించాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. ‘‘గత రెండేళ్లుగా నా కెరీర్ సాగుతున్న తీరు చూసుకుంటే.. నేనింకా అంతర్జాతీయ క్రికెట్‌లో చేయాల్సింది చాలా ఉంది. న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే నేను ఎప్పటికపుడు గేమ్‌పై వర్క్ చేయాలి.
అప్పుడే మిగతా ఆటగాళ్లతో పోటీ పడగలను. కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటమే నాకు ముఖ్యం’’ అని జెమీసన్ పేర్కొన్నాడు. ఇక గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరఫున మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన జేమీసన్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం మెరుగ్గా రాణించాడు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహణకు ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment