Kyle Jamieson Pulls Out Of IPL 2022 Mega Auction: గతేడాది ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్.. త్వరలో జరగనున్న మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ నుంచి మొత్తం 24 మంది వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. అందులో జేమీసన్ పేరు కనపడలేదు. గతేడాది జరిగిన వేలం సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. జేమీసన్‌ను ఏకంగా రూ. 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో బౌలర్ల జాబితాలో అత్యధిక ధర పలికిన ఆటగాడు జేమీసనే కావడం విశేషం.
అయితే ఆ సీజన్‌లో అతను పెద్దగా రాణించకపోవడంతో మెగా వేలానికి ముందు ఆర్సీబీ అతన్ని వదులుకుంది. గత సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన జేమీసన్ 28 ఓవర్లు వేసి భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా, ఇటీవలి కాలంలో జేమీసన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఐపీఎల్ వేలంలో పాల్గొనలేకపోవడం విశేషం. బయో బబుల్‌కు బయపడే అతను క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్-2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు.
చదవండి: 24 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ.. అయితే..?
Comments
Please login to add a commentAdd a comment