బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఓ రాజకీయ ప్రముఖుడు షార్ట్ లిస్ట్ కావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి, మాజీ టీమిండియా ఆటగాడు మనోజ్ తివారి వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. 36 ఏళ్ల మనోజ్ తివారి రూ.50 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో వేలం బరిలోని నిలిచాడు.
తివారి 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివ్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. కుడి చేతి మిడిలార్డర్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ ఆయిన తివారి 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 302 పరుగులు, 5 వికెట్లు సాధించాడు. తివారి వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. తివారికి టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు లభించనప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం దాదాపు 10 ఏళ్ల రెగ్యులర్‌గా కొనసాగాడు. అతను 2008-18 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్‌ల్లో 117 స్ట్రయిక్ రేట్‌లో 1695 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వీరిలో ప్రస్తుతం అండర్-19 వరల్డ్‌కప్ ఆడుతున్న భారత కుర్రాళ్లతో పాటు పలువురు దేశీయ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొంటున్న వారిలో సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ ఇమ్రాన్ తాహీర్(42) అతి పెద్ద వయస్కుడు కాగా, అఫ్ఘాన్ ప్లేయర్ నూర్ అహ్మద్(17) అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. ఈసారి వేలంలో వీరితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(20 లక్షల బేస్ ప్రైజ్), సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్, ‘బేబీ ఏబీడీ’ డివాల్డ్ బ్రేవిస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నారు.
చదవండి: IPL 2022 Auction: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment